ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 మే 2024 (14:18 IST)

ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ప్రయాణించిన సైనిక శునకం

meru dog
మెరూ అనే తొమ్మిదేళ్ల సైనిక శునకం ప్రస్తుతం ఆన్‌లైన్ సెన్సేషనల్‌గా మారిపోయింది. దీనికి కారణం లేకపోలేదు. రిటైరైన సందర్భంగా సైన్యం దాన్ని సగౌరవంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించారు. ఇది నెటిజన్ల మనసు గెలుచుకుంది. పైగా, ఈ శునకాన్నిఫ రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో కుక్క ప్రయాణించిన ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. అందులో మెరూ తన బెర్త్‌పై దర్జాగా దుప్పటి కప్పుకొని కనిపించింది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కునుకుతీసింది.
 
22 ఆర్మీ డాగ్ యూనిట్‌లో ట్రాకర్ డాగ్‌గా లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన మెరూ పనిచేసింది. ప్రాణాంతక పేలుడు పదార్థాల జాడ పసిగట్టడం, ఉగ్రవాదుల కాలిబాట ప్రకారం వారు ఎక్కడ దాక్కున్నారో ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది. తొమ్మిదేళ్ల సర్వీసు అనంతరం తాజాగా రిటైరైంది. మీరట్‌లోని సైనిక శునకాల రిటైర్మెంట్ కేంద్రంలో శేషజీవితాన్ని ప్రశాంతంగా గడుపనుంది. 
 
దేశంలో ఉగ్రదాడులను నిరోధించేందుకు తన వంతు ప్రయత్నం చేసిన మెరూను గౌరవప్రదంగా రిటైర్మెంట్ కేంద్రానికి తరలించాలని సైన్యం నిర్ణయించింది. సైనిక శునకాలు రిటైరయ్యాక వాటి శిక్షకులతో కలసి ఫస్ట్ క్లాస్ ఏసీ రైళ్లలో ప్రయాణించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల అనుమతిచ్చింది. దీంతో యూపీలోని మీరట్‌లో ఉన్న ఆ కేంద్రానికి మెరూను తరలించేందుకు సైన్యం దాని పేరుతో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెర్త్ బుక్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను అశోక్ బిజల్వాన్ అనే రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. అయితే, ఈ శునకం ఎక్కడ రైలు ఎక్కిందో మాత్రం వెల్లడించలేదు.