శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (21:20 IST)

భారత్ బంద్ పాటించే సమయం ఎంతంటే?

కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన రైతులు రోడ్డెక్కారు. ఈ ఆందోళన గత 12 రోజులుగా సాగుతోంది. ఛలో ఢిల్లీ పేరుతో ఈ ఆందోళన చేపట్టారు. కానీ, రైతులను హస్తినలో అడుగుపెట్టనీయకుండా ఢిల్లీ పోలీసులు కరోనా ఆంక్షల పేరుతో ఢిల్లీ సరిహద్దుల్లోనే కట్టడి చేశారు. 
 
అటు కేంద్ర ప్రభుత్వ వైఖరి, ఇటు పోలీసుల దమనకాండకు నిరసనగా రైతు సంఘాలు మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్ మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్ ప్రకటించారు. సామాన్య ప్రజానీకానికి ఇబ్బంది కలగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
 
బంద్ ప్రారంభమయ్యే 11 గంటల లోపు అందరూ వారి కార్యాలయాలకు వెళ్లొచ్చని... 3 గంటలకు బంద్ ముగిసిన తర్వాత ఇళ్లకు చేరుకోవచ్చని టికాయత్ తెలిపారు. అంబులెన్స్‌లను అడ్డుకోబోమన్నారు. ముందుగా నిశ్చయించుకున్న ముహుర్తాలకే పెళ్లిళ్లు యధావిధిగా జరుపుకోవచ్చని అన్నారు. కేవలం తమ నిరసనను వ్యక్తం చేయడానికి మాత్రమే బంద్ చేపడుతున్నామని, శాంతియుతంగా బంద్ కొనసాగుతుందని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలు తమకు సమ్మతం కాదనే విషయాన్ని చెప్పడానికే బంద్ చేపడుతున్నామని తెలిపారు.