గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:41 IST)

సీఏఏ ఎఫెక్ట్: అసోం పర్యటకానికి 1000 కోట్లు నష్టం

పౌర నిరసనల వల్ల అసోం పర్యటక రంగం భారీగా దెబ్బతింది. దాదాపు వెయ్యి కోట్ల మేర నష్టం వాటిల్లే అవకాశమున్నట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపుచేసేందుకు ఆ రాష్ట్ర పర్యటక అభివృద్ధి సంస్థ ప్రణాళికలను రచిస్తోంది.

పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలు చేపట్టిన నిరసనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అసోంలో పౌర నిరసనలు భారీ స్థాయిలో జరిగాయి. దీని వల్ల ఆ రాష్ట్ర పర్యటక రంగం తీవ్రంగా దెబ్బతింది. పౌర నిరసనలతో దాదాపు 1,000 కోట్ల నష్ట్రం అంచనా వేస్తున్నట్టు ఓ అధికారి వెల్లడించారు.

అసోం పర్యటక రంగానికి డిసెంబర్- మార్చి మధ్య కాలం ఎంతో ముఖ్యం. మొత్తం ఏడాదిలో 48శాతం లబ్ధి ఈ నెలల నుంచే పొందుతుంది అసోం పర్యటక అభివృద్ధి సంస్థ(ఏటీడీసీ). కానీ పౌర నిరసనల వల్ల డిసెంబర్లో పర్యటకుల సంఖ్య భారీగా తగ్గిందని.. జనవరిలోనూ ఇదే కొనసాగే అవకాశముందని అభిప్రాయపడింది.

డిసెంబర్ 11 నుంచి హొటల్ పరిశ్రమలు కూడా భారీగా నష్టపోయాయి. 15 రోజుల్లో రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. దేశీయ పర్యటకులతో పాటు విదేశాల నుంచి వచ్చే వారి సంఖ్యా భారీగా పడిపోయింది. భారత్లో పర్యటించాలంటే జాగ్రత్త వహించాలని ఆయా దేశాలు సూచించడం కూడా ఇందుకు ఓ కారణం.
 
పౌరసత్వ చట్టంపై రాష్ట్రాలకు ఆ అధికారం లేదు: కేంద్రం
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ని రాష్ట్రాల్లో అడ్డుకునేందుకు బీజేపీ యేతర ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త వాదన తెరపైకి తీసుకొచ్చింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాల్లో చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదనీ... కేవలం పార్లమెంటుకు మాత్రమే ఆ అధికారం ఉందని స్పష్టం చేసింది.

సీఏఏని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు స్పందించారు. ‘‘పౌరసత్వ సవరణ చట్టంతో దేశంలోని ఏ పౌరుడికీ సంబంధం లేదు. స్వార్థ ప్రయోజనాల కోసం ఈ చట్టానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం మొదలైంది...’’ అని ఆయన పేర్కొన్నారు.
 
జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) పైనా ఆయన స్పందించారు. ‘‘ఎన్పీఆర్ అనేది సాధారణ నివాసితులకు సంబంధించిన సంక్షిప్త రూపం.. దీనికి పౌరులతో సంబంధం లేదు..’’ అని వివరించారు. కాగా మంగళవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సీఏఏకి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

కేరళలో ఎలాంటి నిర్బంధ శిబిరాలు ఉండబోవని ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు. లౌకికవాదానికి రాష్ట్రంలో సుదీర్ఘ చరిత్ర ఉన్నదని సీఎం పేర్కొన్నారు. తాజా చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలతో... అంతర్జాతీయ సమాజం ముందు భారత ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని సీఎం ఆరోపించారు.