శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 1 జనవరి 2020 (16:25 IST)

సుస్థిరాభివృద్ధిలో దూసుకెళ్తున్న దక్షిణాది

నీతి ఆయోగ్‌ విడుదల చేసిన దేశీయ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి కళ్లకు కడుతోంది. నిర్దేశిత లక్ష్యాలను సాధించే క్రమంలో కేరళ, హిమాచల్ ప్రదేశ్ తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.

తమిళనాడుతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలూ సంయుక్తంగా మూడో ర్యాంకును ఒడిసిపట్టాయి. తొలి ఆరుస్థానాల్లో అయిదు దక్షిణాది రాష్ట్రాలే కావడం విశేషం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో గుజరాత్‌, మహారాష్ట్రలకన్నా దక్షిణాది రాష్ట్రాలు ముందుకు దూసుకుపోవడం ప్రాథమ్యక్రమంలో చోటుచేసుకున్న మార్పులకు అద్దం పడుతోంది.

మరోవైపు వెనకబడిన రాష్ట్రాల వాస్తవ స్థితిగతుల్లో ఏమంత మెరుగుదల సాధ్యపడలేదని ఈ సూచీ సోదాహరణంగా చాటుతోంది. నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన దేశీయ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీ దక్షిణాది రాష్ట్రాల ధాటిని కళ్లకు కడుతోంది.

ఇంకో పదేళ్లలో నెరవేర్చాల్సినవిగా నిర్దేశించుకున్న లక్ష్యాలను ధీమాగా సాధించే క్రమంలో కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ శీఘ్రగతిన పురోగమిస్తుండగా- వాటిని వెన్నంటి తమిళనాడుతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలూ సంయుక్తంగా మూడో ర్యాంకును ఒడిసిపట్టాయి. హిమాచల్‌ను మినహాయిస్తే జాబితాలోని తొలి ఆరింటిలో అయిదు దక్షిణాది రాష్ట్రాలే!

కేంద్రపాలిత ప్రాంతాల్లో చండీగఢ్‌ నూటికి 70 మార్కులు సంపాదించి కేరళకు దీటుగా నిలవడం విశేషం. ఆరోగ్యం, నాణ్యమైన విద్య, లింగపరమైన సమానత్వం, పరిశుభ్ర జలాలు పారిశుద్ధ్యం, ఆకలి పేదరికాల కట్టడి తదితరాల్లో అంశాలవారీగా రాష్ట్రాల పనితీరును మదింపు వేసిన కసరత్తు ఇది.

దేశంలోని 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నూటికి 50 మార్కులే సాధించగా- ఆకలి, పోషకాహార లోపాల ఉద్ధృతిని చాటుతూ ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌ 30 కన్నా దిగువస్కోరుకు పరిమితమయ్యాయి. వాటితో పోలిస్తే 65, అంతకన్నా ఎక్కువ పాయింట్లు సంపాదించిన రాష్ట్రాల జాబితాలో చేరిన గోవా, సిక్కిమ్‌ తామెంతగానో మిన్నగా నిరూపించుకున్నాయి.

ఏడాదిక్రితం నీతి ఆయోగ్‌ క్రోడీకరణలో హిమాచల్‌, కేరళ, తమిళనాడు- ఈ మూడే పురోగామి రాష్ట్రాలుగా కితాబులందుకోగలిగాయి. ఈసారి ఆ శ్రేణిలోకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సిక్కిమ్‌, గోవా అదనంగా చేరడం శుభ సూచకం.

సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో గుజరాత్‌, మహారాష్ట్రలకన్నా దక్షిణాది రాష్ట్రాలు ముందుకు దూసుకుపోవడం ప్రాథమ్యక్రమంలో చోటుచేసుకున్న మార్పులకు అద్దం పడుతోంది. పంట దిగుబడి, అర్ధాంతరంగా బడి మానేస్తున్న పిల్లల సంఖ్య తదితరాల్లో మెరుగైన దిద్దుబాటు చర్యలు చేపడితే- అది దక్షిణ భారతావని సమగ్రాభివృద్ధిలో మేలుమలుపవుతుంది!