మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 21 సెప్టెంబరు 2019 (08:31 IST)

అత్యాధునిక తరహా ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నదులపై ఎత్తైన వంతెనలు నిర్మించి, అత్యాధునిక హంగులతో ప్రాజెక్టుల ఏర్పాటుకు దక్షిణ కొరియా కాన్సులేట్, ప్రతినిధుల బృందం ఆసక్తి ప్రదర్శించింది. పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో దక్షిణ కొరియా కాన్సులేట్ , ప్రతినిధుల బృందం  సమావేశమయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల ఏర్పాటుకు గల అవకాశాలపై, రాష్ట్రంలోని అనుకూల పరిస్థితులపై  మంత్రి సుదీర్ఘంగా కొరియా ప్రతినిధులకు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాబోయే ఐదేళ్లలో మౌలిక వసతుల కల్పన రంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటుందో మంత్రి స్పష్టంగా వెల్లడించారు.

ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక పాలసీ తీసుకురానున్నామని మంత్రి కొరియా ప్రతినిధి బృందానికి తెలిపారు. ఏపీలో స్టార్టప్ సెంటర్, ఇండస్ట్రియల్ కాంప్లెక్స్, మౌలిక వసతులపై చర్చించారు. ఈ - కామర్స్ టూల్, బ్లాక్ చైన్ టెక్నాలజీపై శిక్షణ, వొకేషనల్ ట్రైనింగ్ ల పైనా చర్చించారు.

బ్లాక్ చైన్ టెక్నాలజీతో రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంచడానికి కృషి చేయనున్నామని మంత్రి అన్నారు. భూముల ధృవీకరణ పత్రాలలో అక్రమాలకు తావులేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించుకునే ఆలోచనలో ఉన్నామని మంత్రి మేకపాటి అన్నారు. త్వరలోనే ఐ.టీ, ఇండస్ట్రీకి సంబంధించిన పాలసీలను విడుదల చేస్తామని ప్రతినిధులకు మంత్రి స్పష్టం చేశారు.

పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంపై మొదట పరిశ్రమల యాజమాన్యాలు ఆశ్చర్యపోయినా...ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును వివరంగా అర్థం చేసుకుని ప్రభుత్వంతో భాగస్వామ్యం అవడానికి ముందుకొస్తున్నారన్నారు మంత్రి.

రాష్ట్రంలో ఎగుమతుల కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా సానుకూలత వ్యక్తం చేసిందని అన్నీ అనుకూలిస్తే విశాఖలో ఎక్స్ పోర్ట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలను పెంచి, ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే దిశగా వాణిజ్య రంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు.

మంత్రి కార్యాలయంలో ఏర్పాటు చేసిన  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న నవరత్నాలను ముద్రించిన వాల్ పోస్టర్ ను చూసి కొరియా ప్రతినిధి ఆసక్తికరంగా మంత్రిని ప్రశ్నించారు. చిన్న చిన్న పనులు చేసుకునే వ్యక్తులు ఆదాయమంతా మద్యానికే వెచ్చిస్తూ కుటుంబాలను ఆర్థికంగా చితికిపోయేలా చేస్తుండడం గమనించిన ముఖ్యమంత్రి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం విడతల వారీగా మద్యాన్ని  నియంత్రిస్తున్నారని మంత్రి సమాధానం చెప్పారు.

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో జరిగిన దక్షిణ కొరియా ప్రతినిధుల సమావేశంలో ఏపీపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ్ జైన్, ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్ సింగ్, ఐ.టీ సలహాదారులు పాల్గొన్నారు.