మా మామ ఆరోగ్యంగానే ఉన్నారు.. శివప్రసాద్ అల్లుడు : బాబు పరామర్శ

siva prasad  - babu
Last Updated: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (17:55 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు మాజీ ఎంపీ, సినీ నటుడు శివప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నట్టు ఆయన అల్లుడు నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు.
శివప్రసాద్‌కు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని, అధికారికంగా తాము ప్రకటించే వరకు వదంతులను నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇదే అంశంపై ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అదేసమయంలో చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివప్రసాద్‌ను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం పరామర్శించారు.

కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శివప్రసాద్ ప్రస్తుతం చెన్నైలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అన్ని వార్తా పత్రికలతోపాటు... ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ఆయన అల్లుడు స్పందించారు. తమ మామ శివప్రసాద్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.
siva prasad  - babu

అదేసమయంలో శుక్రవారం విజయవాడ నుంచి చెన్నైకు చేరుకున్న చంద్రబాబు, నేరుగా ఆస్పత్రికి వెళ్లి శివప్రసాద్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం శివప్రసాద్ భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివప్రసాద్‌ను పరామర్శించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎంపీ శివప్రసాద్‌ పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబసభ్యులకు చంద్రబాబు ధైర్యానిచ్చారు.

ఈనెల 12 నుంచి శివప్రసాద్‌కు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో కుటుంబసభ్యులు ఇంటికి తీసుకువచ్చారు. అయితే వ్యాధి మళ్లీ తిరుగదోడడంతో గురువారం ఉదయం ఆయన్ను తిరిగి చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు.దీనిపై మరింత చదవండి :