శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 19 సెప్టెంబరు 2019 (08:33 IST)

దక్షిణాదికి లోక్‌సభ స్థానాల కోత?

దక్షిణ భారతదేశంపై ఇప్పటికే చిన్నచూపు చూస్తున్న కేంద్రం.. మరో వివక్షకు పూనుకుందా?... దక్షిణాది గొంతును పలుచన చేసేందుకు సిద్ధమైందా?... జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే అవుననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.

కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు రేపు నియోజకవర్గాల పునర్‌ విభజనలోనూ బుల్డోజింగ్‌ తప్పదేమోనన్న అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. పదిహేనో ఆర్థిక సంఘం నిధులు కేటాయించడానికి 2011 జనాభాను ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. దీనివల్ల తమకు వచ్చే ఆదాయం తగ్గే అవకాశముందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి.

జనాభా నియంత్రణను పాటించడమే తమకు శాపమైందని మొర పెట్టుకున్నాయి. అంతకుముందు 14వ ఆర్థిక సంఘం వరకు 1971 జనాభానే ప్రాతిపదిక అయింది. పదిహేనో ఆర్థిక సంఘానికే 2011 జనాభాను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల నష్టపోవలసి వస్తోందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. లోక్‌సభ సీట్ల విషయంలోనూ అదే జరగబోతోందన్నది దక్షిణాది రాష్ట్రాల భయం.
 
దేశంలో ప్రస్తుతం 543 లోక్‌సభ నియోజవర్గాలు ఉన్నాయి. 1971 జనాభా ప్రాతిపదికగా ఈ నియోజవర్గాలు ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. తదనుగుణంగానే ఆయా రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ఉంది. 1957, 1962 లోక్‌సభ ఎన్నికలకు 1951 నాటి జనాభాను ప్రాతిపదికగా చేసుకుని వివిధ రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల సంఖ్యను ఖరారు చేశారు.

అప్పుడు మొత్తం 494 సీట్లు మాత్రమే ఉన్నాయి. అనంతరం జరిగిన 1967 ఎన్నికలకు 1961 జనాభా లెక్కలను ఆధారం చేసుకున్నారు. అప్పుడు లోక్‌సభ సీట్ల సంఖ్య 520. ఆ తర్వాత 1971 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక 1976లో మొత్తం సీట్లు 543 అయ్యాయి.

అప్పట్లో పదేళ్లకోసారి రాష్ట్రాల నియోజకవర్గాల సంఖ్యను జనాభా లెక్కల ఆధారంగా మార్చుకుంటూ వెళితే జనాభా నియంత్రణను విజయవంతంగా అమలుచేసే రాష్ట్రాలు అన్యాయమైపోతాయని భావించి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 2000 సంవత్సరం వరకు నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా చట్టం తెచ్చారు.

2002లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి వచ్చినపుడు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యనేత ములాయంసింగ్‌ యాదవ్‌ను అప్పటి ప్రధాని వాజ్‌పేయి నచ్చజెప్పడంతో రాష్ట్రాల వారీగా సీట్ల సంఖ్య మారకుండా నియోజవర్గాల పునర్‌ విభజనకు అంగీకరించారు. మళ్లీ 2026 వరకు దేశవ్యాప్త పునర్విభజన జరగకుండా చట్టం తెచ్చారు.

రాష్ట్రాలకు కేటాయించిన సీట్ల సంఖ్య అలానే ఉండిపోయింది. 1971 నాటి జనాభా ఆధారంగా చేసిన సీట్ల కేటాయింపు 2026 వరకూ కొనసాగనుంది. 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్‌ జరగాలని చట్టం చెబుతోంది. అంటే 2031 జనాభా లెక్కల ప్రాతిపదికన డీలిమిటేషన్‌ జరుగుతుంది.
 
అప్పుడు ఉత్తరాది రాష్ట్రాల సీట్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు జనాభా నియంత్రణను సమర్థంగా చేయగలిగాయి.

జాతీయ సగటు కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా 4 వరకు తగ్గింది. ఇలాంటి రాష్ట్రాలను ప్రోత్సహించాలి. జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గే అవకాశముంది.