ఆదివారం, 13 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024 (10:42 IST)

త్వరలోనే పుస్తకాలూ చూసి పరీక్షలు రాసే విధానం.. ఎక్కడ?

open book exam
దేశ విద్యా విధానంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇందులోభాగంగా, మున్ముందు పుస్తకాలు చూసి పరీక్షలు రాసే విధానం అమల్లోకి రానుంది. ఈ యేడాది నవంబరు, డిసెంబరు నెలల్లో కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు సీబీఎస్ఈ అధికారులు తెలిపారు. 10వ తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షలకు మాత్రం ఈ ఓపెన్ బుక్ పరీక్షా పద్ధతిని ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని వివరించారు. 
 
ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 9, 10 తరగతుల్లో ఆంగ్లం, గణితం, సైన్స్ సబ్జెక్టులు, అదేవిధంగా 11, 12 తరగతుల్లో ఆంగ్లం, గణితం, జీవశాస్త్ర సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలను ప్రవేశపెట్టాలని సీబీఎస్ఈ యోచిస్తోంది. ఈ పద్ధతిలో విద్యార్థులు పరీక్ష రాయడానికి ఎంత సమయం పడుతుందో గమనిస్తారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరిస్తారు. ఓపెన్ బుక్ పద్ధతిలో విద్యార్థులు పాఠ్య గ్రంథాలను, అధ్యయన సామగ్రినీ వెంట తీసుకుపోవచ్చు. వాటిని చూస్తూ పరీక్ష రాయవచ్చు.
 
దీనివల్ల విద్యార్థుల సృజనాత్మకత, సమస్యా పరిష్కార శక్తి, తార్కిక ఆలోచనా పద్ధతిని బేరీజు వేస్తారు. 2014 నుంచి 2017 వరకు ఓపెన్ బుక్ పద్ధతితో ప్రయోగాలు చేసినా వాటిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అమెరికా కళాశాలల్లో ప్రవేశం పొందాలంటే అడ్వాన్స్‌డ్ ప్లేస్మెంట్ (ఏపీ) పరీక్షలు రాయాలి. ఆ పరీక్షా పత్రాల్లో ఇచ్చే ప్రశ్నలు చాలా స్పష్టంగా ఉంటాయి. ఏపీ ప్రశ్నలను పరిశీలించి ఓపెన్ బుక్ పరీక్షా పద్ధతి ప్రవేశపెట్టాలని ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ జ్యోతి శర్మ సూచించారు.