శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 21 డిశెంబరు 2018 (13:19 IST)

పేరుగాంచిన రూ. 5 డాక్టర్ ఇకలేరు...

ఆసుపత్రికి వెళ్లాలంటే ఇప్పుడు జేబులకు చిల్లులు పడిపోతాయ్. కానీ ఆ డాక్టర్ మాత్రం రోగుల నుంచి ఫీజుగా రూ. 5 తీసుకునేవారు. ఆయనే డాక్టర్ జయచంద్రన్. ఐదు రూపాయల డాక్టరుగా పేరుగాంచిన ఆయన బుధవారం నాడు చెన్నైలోని తన స్వగృహంలో స్వర్గస్తులయ్యారు. ఆయన మరణవార్త వినగానే భారీ సంఖ్యలో పేద ప్రజలు తరలివచ్చి ఆయనకు నివాళులర్పించారు.
 
చెన్నైలోని వాషర్‌మెన్‌పేట ప్రజలకు ఏ జబ్బు వచ్చినా ఈ 5 రూపాయల డాక్టరే దిక్కు‌. ఇపుడు ఆయన లేరన్న వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు. 71 ఏళ్ల వయసున్న జయచంద్రన్ స్వస్థలం కాంచీపురం జిల్లాలోని కొడైపట్టినం గ్రామం. 1947లో జన్మించారాయన. మద్రాసు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వాషర్‌మెన్ పేటలో ప్రైవేట్ క్లినిక్ పెట్టారు. గత కొన్నేళ్లుగా అక్కడి పేదవారికి వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. 
 
మొదట్లో ఫీజుగా రూ. 2 తీసుకునేవారు. కానీ ఆ డబ్బులు తన వద్ద పనిచేసే సిబ్బందికి కూడా చాలకపోవడంతో ఇబ్బందులు పడేవారు కానీ ఫీజు పెంచలేదు. పేదలకు ఆయన చేస్తున్న సేవలను చూసి కొందరు నర్సులు ఉచితంగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫీజును రూ. 5 చేశారు. అప్పట్నుంచి చివరి వరకూ అదే ఫీజును కొనసాగించారు. 
 
కాగా డాక్టర్ జయచంద్రన్ సతీమణి డాక్టర్ వేణి చెన్నై ప్రభుత్వాస్పత్రిలో డీన్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. కుమార్తె శరణ్య స్టాన్లీ ఆస్పత్రిలో వైద్యురాలిగానూ, పెద్దకుమారుడు శరత్ ఓమందూర్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వైద్యుడిగా, చిన్న కుమారుడు శరవణన్ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు.