శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 15 ఏప్రియల్ 2021 (20:39 IST)

ఛత్తీస్‌ఘడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్‌ను మింగేసిన కరోనావైరస్, 2 టీకాలు తీసుకున్నా వదల్లేదు

కరోనావైరస్ సెకండ్ వేవ్ దేశంలో తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తోంది. కేసులు లక్షల్లో పెరిగిపోతుంటే మరణాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో పరిస్థితి చాలా ఆందోళనకరంగా మారిపోయింది. తాజాగా ఛత్తీస్ ఘడ్ హెల్త్ జాయింట్ డైరెక్టర్ సుభాష్ కరోనా కారణంగా మృతి చెందారు. ఆయన గత మార్చి నెలలోనే కోవిడ్ రెండు డోసులు తీసుకున్నారు.
 
ఐతే రెండో డోసు తీసుకున్న అనంతరం మూడు రోజుల తర్వాత ఆయనలో కరోనా లక్షణాలు వెలుగుచూసాయి. దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆయన పరీక్ష చేయించుకోగా కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయ్యింది. దాంతో ఆయన మూడు రోజుల క్రితం రాయ్ పూర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం అర్థరాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించి ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. వెంటిలేటర్ పైన వుంచి చికిత్స అందించినా ఫలించలేదు. దీనితో ఆయన బుధవారం నాడు కన్నుమూసినట్లు వైద్యులు ధృవీకరించారు.
 
మరోవైపు దేశంలో గడిచిన 24 గంటల్లో 2,00,000 కంటే ఎక్కువ కేసులు నమోదైనాయి. COVID-19 కేసులు దేశంలో గణనీయంగా పెరుగుతున్నాయి. గురువారం 1,000 మందికి పైగా మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు అరకొరగా వున్నాయనే ఆందోళనల మధ్య, ప్రభుత్వ ప్యానెల్ దేశంలో తగినంత వైద్య ఆక్సిజన్ సరఫరా ఉందని ప్రజలకు హామీ ఇస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
 
అలాగే దేశంలోని 10 రాష్ట్రాలలో డబుల్ మ్యూటెంట్ కరోనా వైరస్ విజృంభిస్తోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో విస్తృతంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. గతంలో కరోనా వైరస్ వచ్చి తగ్గిన వారిలో మరోసారి కరోనా పాజిటివ్ వస్తోంది. డబుల్ మ్యూటెంట్ వైరస్‌తో 18 నుండి 45 సంవత్సరాలలోపు వారిలో మరణాల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ఉత్పరివర్తన జాతులు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది.
 
కోవిడ్-19 కేసులు వేగంగా పెరగడంలో ఈ మార్పుచెందిన వైరస్ కలిగిన వారు కీలక పాత్ర పోషిస్తున్నారని వైద్య వర్గాలు అంటున్నాయి. ఢిల్లీలో యూకే స్ట్రెయిన్, డబుల్ మ్యూటేషన్లతో కూడిన జాతులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.