మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:36 IST)

కరోనావైరస్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిస్థితి కూడా మహారాష్ట్రలా మారుతుందా? ప్రభుత్వాలు ఏమంటున్నాయి?

తెలుగు రాష్ట్రాల్లో కరోనావైరస్ వ్యాప్తి రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈసారి వైరస్ అతి వేగంగా వ్యాపిస్తోంది. స్వయంగా తెలంగాణ వైద్య అధికారులు ఈ విషయాన్ని ప్రకటించారు. జనం జాగ్రత్తలు పాటించకపోతే తెలంగాణ మరో మహారాష్ట్ర అవుతుందని హెచ్చరిస్తున్నారు. అటు ఆంధ్రలో కూడా కరోనా తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. విజయవాడ ఆసుపత్రిలో పడకల కొరత కనిపిస్తోంది.

 
కరోనా రెండోసారి విస్తరించడం మొదలుపెట్టాక, ఇది 2020లో ఉన్నదాని కంటే తీవ్రంగా కనిపిస్తోంది అని నిపుణులు చెబుతూ వచ్చారు. ముందుగా కేవలం మహారాష్ట్ర గురించే వార్తలు వచ్చినా, తెలుగు రాష్ట్రాలకు కూడా ఇందుకు మినహాయింపు కాదు. రెండు రాష్ట్రాల్లోనూ కేసులు చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి.

 
ఎన్ని కేసులు?
అధికారిక లెక్కల ప్రకారం ఏప్రిల్ 13న ఆంధ్రలో 35 వేల 732 పరీక్షలు చేస్తే అందులో 4,157 మందికి పాజిటివ్ వచ్చింది. 18 మంది మరణించగా, 16 వందల మంది కోలుకున్నారు. కరోనా కేసుల్లో అత్యధికంగా తూర్పు గోదావరి నుంచి 617, చిత్తూరు 517, గుంటూరు 434, శ్రీకాకుళం 522, విశాఖ 417, కర్నూలు 386 కేసులు నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 28, 383 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 
అదే ఏప్రిల్ 13న తెలంగాణలో 72,364 మందికి పరీక్షలు చేయగా, 2,157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8 మంది చనిపోగా, 821 మంది కోలుకున్నారు. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్‌లో 361, మేడ్చల్-మల్కాజ్‌గిరి 245, రంగారెడ్డి 206, సంగారెడ్డి 135, నిజామబాద్ 187, జగిత్యాల 107 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 25,459 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 
కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ''గత రెండు వారాలుగా నాకు తెలిసిన ఎవరో ఒకరికి పాజిటివ్ వచ్చిందనే వార్త వింటూనే ఉన్నాను'' అని హైదరాబాద్ మెహదీ పట్నంలోని సాయి బీబీసీతో అన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో ఆయనకు కూడా పాజిటివ్ వచ్చింది. కానీ కోలుకున్నారు. అయితే సాయి చెప్పిన మాటలు రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

 
పడకల సంఖ్య
గత ఏడాదిలాగే, ఈ ఏడాది కూడా ఆస్పత్రుల్లో పడకల కొరత కూడా పెరుగుతోంది. కూకట్‌పల్లిలోని ఒక మామూలు ప్రైవేటు ఆసుపత్రిలోనే పడక దొరకడం కష్టంగా ఉందని దీప్తి బీబీసీతో అన్నారు. కరోనా వచ్చిన బంధువును ఆస్పత్రిలో చేర్చించడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు, అంటే, గతేడాది తన తండ్రికి పాజిటివ్ వచ్చినప్పుడు చికిత్స కోసం వెళ్లిన ఆస్పత్రికే ఆమె మళ్లీ తమ బంధువును తీసుకెళ్లారు. అప్పుడు అడ్మిషన్ సులభంగా దొరికినా, ఇప్పుడు కష్టమైందని దీప్తి అన్నారు.

 
''ఈసారి ఎలాగైనా బెడ్ ఇప్పించమని డాక్టర్‌ను అడిగాను. కానీ, అప్పటికే ఆస్పత్రి ఫుల్‌గా ఉంది. సిబ్బంది మీద ఇంకా ఒత్తిడి పడితే, వాళ్లు పనిచేయడం మానేస్తారు. కొత్తవాళ్లు ఎవరూ చేరడం లేదు. అని డాక్టర్ చెప్పారు'' అన్నారు దీప్తి. అయినప్పటికీ, ఆమె తన బంధువుకు అదే ఆసుపత్రిలో అడ్మిషన్ సంపాదించగలిగారు. అదేవిధంగా, గచ్చిబౌలిలోని ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో తమ వారిని అడ్మిట్ చేయించగలిగారు హైదరాబాద్‌కి చెందిన శ్రీనివాస్.

 
అయితే, పడకల విషయంలో ప్రభుత్వ వాదన వేరుగా ఉంది. తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో వందలాది పడకలు అందుబాటులో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 1,548 పడకలు ఖాళీగా ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే, తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం పడకలు వేగంగా నిండుతునట్టు ఆ లెక్కలు చెబుతున్నాయి.

 
అటు ఏపీలో కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ఏర్పాటు చేసిన కేంద్రాల్లో పడకలు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ''గతంలో 15 శాతం మంది వరకూ ఆస్పత్రిలో చికిత్స అవసరమయ్యేది. ఈసారీ కేవలం 5 శాతం మందికే ఆస్పత్రి సేవలు అవసరమవుతున్నాయి. కానీ, చాలామంది అవసరం లేకున్నా ఆస్పత్రుల్లో చేరుతున్నారు. 20 పడకలు దాటిన ఆస్పత్రులకు కూడా కరోనా చికిత్సకు అనుమతిస్తున్నాం. గతంలో మెడికల్ కాలేజీ ఆస్పత్రులను సిద్ధం చేశాం కానీ వాడలేదు. ఈసారి వాడతాం. మొత్తం రాష్ట్రంలో 45 వేల పడకల్లో సగం కరోనాకే ఉంచుతాం. ప్రభుత్వ రంగంలో చాలా పడకలు ఉన్నాయి. పైగా వైద్యులకు కూడా చికిత్స విషయంలో అనుభవం వచ్చింది'' అని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియాకు చెప్పారు.

 
అటు ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ ఉన్నతాధికారులు కూడా తాము పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని బీబీసీకి చెప్పారు. రెండు రాష్ట్రాల అధికారులు, నాయకులు కరోనా పడకలు, చికిత్స సామాగ్రి కొరత లేదనే చెబుతున్నారు. కానీ పరిస్థితి ఇలానే కొనసాగితే మన వ్యవస్థలు తట్టుకుంటాయా అనేది పెద్ద ప్రశ్న?

 
కరోనా గాలి ద్వారా వ్యాపిస్తోందా?
బుధవారం సాయంత్రం తెలంగాణ వైద్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా గాలి ద్వారా వ్యాపించే దశకు వచ్చిందని ఆయన అన్నారు. కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే మిగిలిన అందరికీ గంటల వ్యవధిలోనే వ్యాపిస్తోందన్నారు. దీనికి మాస్కు పెట్టుకోవడం ఒకటే శరణ్యం అన్న ఆయన, బయటకు వెళ్లి వచ్చే వారు, ఇంట్లో కూడా మాస్కు పెట్టుకోవాలని సూచించారు.

 
'ఏడాది కాలంగా ప్రజారోగ్య వ్యవస్థ కష్టపడుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ప్రారంభం అయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ కూడా మహారాష్ట్రలా అయ్యే ప్రమాదం ఉంది. ప్రజారోగ్య వ్యవస్థ (ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్యులు, సిబ్బంది) కుప్పకూలే ప్రమాదం ఉంది. ప్రభుత్వం లాక్‌డౌన్ పెట్టడం లేదంటే దాని అర్థం పరిస్థితి తీవ్రంగా లేదని కాదు. ఉపాధి పోతుందని పెట్టడం లేదు. ఆ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని కరోనా నియమాలు పాటించాలి'' అని ఆయన అన్నారు.

 
వాక్సీన్ సంగతి?
ఇక, తెలంగాణలో ఏప్రిల్ 13 వరకూ 23,22,000 మంది వాక్సీన్ తీసుకున్నారు. వీరిలో 20,10,611 మంది మొదటి డోస్, 3,12, 430 మంది రెండో డోస్ వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇక, ఆంధ్రలో ఏప్రిల్ 14 నాటికి మొత్తం 3, 97,857 మందికి వాక్సినేషన్ పూర్తయింది.