1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 7 మే 2016 (16:25 IST)

ధైర్యం లేని మోడీ... అగస్టా విచారణ అంగుళం కూడా కదల్లేదు : కేజ్రీవాల్

ఆగస్టా కుంభకోణం కేసులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఈ కుంభకోణంలో కాంగ్రెస్, బీజేపీలు పొత్తుగా వ్యవహరిస్తున్నాయని దుయ్యబట్టారు. సోనియా గాంధీని అరెస్టు చేసే ధైర్మం మోడీకి లేదన్నారు. 
 
శనివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టా కుంభకోణాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. ఇందులో అరవింద్ కేజ్రీవాల్ పాల్గొని ప్రసంగించారు. ఇటాలీ కోర్టు తీర్పులో సోనియాతోపాటు అహ్మద్‌పటేల్ ఇంకా పలువురు కాంగ్రెస్ ప్రముఖుల పేర్లను ప్రస్తావించిన విషయాన్ని కేజ్రీ గుర్తు చేశారు. అయినా మోదీ ప్రభుత్వం వారిని అరెస్టు చేసేందుకు ధైర్యం చేయడంలేదన్నారు. 
 
అంతేకాకుండా, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా.. అగస్టా కుంభకోణం విచారణ అంగుళం ముందుకు కదల్లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు అవినితీపరులను తప్పకుండా శిక్షిస్తామని ప్రగల్భాలు పలికిన మోడీ... అధికారంలోకి వచ్చాక పిల్లిలా ఉండిపోయారన్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే అగస్టా స్కామ్ దర్యాప్తు అని, ఈ కుంభకోణంలో ఒక్కరిని కూడా జైల్లో పెట్టలేకపోయారని ఆరోపించారు.