శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సందీప్ రేవిళ్ళ
Last Modified: మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (15:50 IST)

కారు బుక్ చేసుకుని క్యాబ్ డ్రైవర్‌ని చంపిన దంపతులు.. ఆ తర్వాత..

కారు బుక్ చేసుకున్న దంపతులు డబ్బు కోసం క్యాబ్ డ్రైవర్‌ని హత్య చేసి దోచుకోవడంతో సహా కారు కూడా అమ్మేయాలని చూసారు. ఈ ఘటన రాజధాని నగరం ఢిల్లీ సమీపంలో నోయిడాలో జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
జనవరి 29 రాత్రి ఫర్హత్ అలీ, సీమాశర్మ అనే ఇద్దరు దంపతులు ఢిల్లీలోని ఎంజీ రోడ్డు నుండి ఘజియాబాద్‌ దాకా ఉబెర్ ద్వారా క్యాబ్ బుక్ చేసారు. క్యాబ్‌లో ఘజియాబాద్ చేరుకున్న తర్వాత ఆ జంట క్యాబ్ డ్రైవర్ రాం గోవింద్ శర్మను టీ తాగి వెళ్లమని ఇంట్లోకి ఆహ్వానించారు. కుతంత్రాన్ని అర్థం చేసుకోలేని డ్రైవర్ లోపలికి వెళ్లాడు. ప్లాన్ ప్రకారం ఆ ఇద్దరూ టీలో మత్తు మందు కలిపి అతనికి ఇచ్చారు. అది తాగి స్పృహ తప్పి పడిపోయిన రాం గోవింద్‌ని గొంతు నులిమి చంపేశారు. 
 
డబ్బు దోచుకున్నారు. కారును పొదల్లో దాచి ఆ తర్వాత మృతుడి శరీరాన్ని మూడు ముక్కలుగా నరికి సమీపంలోని డ్రైనేజీలో పడేశారు. డ్యూటీకి వెళ్లిన రాం గోవింద్ శర్మ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మొదటిగా ఉబెర్ సంస్థను సంప్రదించారు. శర్మ క్యాబ్ వివరాలపై ఆరా తీయగా చివరికి ఫర్హత్ అలీ, సీమాశర్మలు బుక్ చేసినట్లు రుజువైంది. వెంటనే ఘజియాబాద్ వెళ్లిన పోలీసులు దంపతులని అరెస్ట్ చేసారు. కారును అపహరించి అమ్మేయాలని ఈ హత్య చేసినట్లు నిర్ధారించారు. వారిని అదుపులోకి తీసుకున్నారు.