అది మారణహోమంతో సమానం - అధికారులే బాధ్యత : అలహాబాద్ హైకోర్టు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా వుంది. ముఖ్యంగా, పది జిల్లాల్లో ఈ వైరస్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. దీంతో అనేక మంది కరోనా రోగులు మృత్యువాతపడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మరింత అధ్వాన్నంగా వుంది. దీనిపై అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం ఓ నేరపూరిత చర్య అని, ఇది మారణ హోమానికి ఏమాత్రం తక్కువ కాదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. లక్నో, మీరట్ జిల్లాల్లో ఎంతో మంది పేషెంట్లు ఆక్సిజన్ లేక చనిపోతున్నారన్న వార్తలపై కోర్టు ఇలా స్పందించింది.
ఈ ఘటనలపై విచారణకు కూడా కోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, క్వారంటైన కేంద్రాల దుస్థితిపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. హాస్పిటల్స్‌కు ఆక్సిజన్ సరఫరా చేయకపోవడం వల్ల కొవిడ్ పేషెంట్లు చనిపోవడం మమ్మల్ని చాలా బాధిస్తోంది. ఇది నేరపూరిత చర్య. ఈ పని చేయాల్సిన అధికారులు చేస్తున్న మారణ హోమం ఇది అని ఇద్దరు జడ్జీల ధర్మాసనం వ్యాఖ్యానించింది.
సైన్స్ ఇంతగా పురోగతి సాధించినకాలంలోనూ మన వాళ్లను ఇలా ఎలా చంపుకుంటాం అంటూ కోర్టు ప్రశ్నించింది. 48 గంటల్లో దీనిపై విచారణ జరిపి తర్వాతి విచారణ సందర్భంగా ఆన్‌లైన్‌లో హాజరుకావాలని లక్నో, మీరట్ జిల్లాల మెజిస్ట్రేట్లకు కోర్టు ఆదేశించింది.