కరోనాలో కర్నూలు రికార్డు - సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్ కార్యాలయం మూసివేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. ఈ జిల్లాలో కొత్తగా మరో 30 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 466కు చేరింది. అలాగే, కరోనా వైరస్ దెబ్బకు ఢిల్లీలోని సీఆర్పీఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 6,534 శాంపిళ్లను పరీక్షించగా 58 మందికి కొవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,583గా ఉందని తెలిపింది. వారిలో ఇప్పటివరకు 488 మంది డిశ్చార్జ్ కాగా, 33 మంది మరణించారని తెలిపిది.
అలాగే, రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,062గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 7, చిత్తూరులో 1, గుంటూరులో 11, కృష్ణాలో 8, కర్నూలులో 30, నెల్లూరులో 1 కేసు నమోదయ్యాయి. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
ఇదిలావుంటే, కరోనా వైరస్ కారణంగా ఢిల్లీలోని సీఆర్‌పీఎఫ్ హెడ్‌క్వార్టర్స్ భవనం మూసివేశారు. సీఆర్‌పీఎఫ్ అధికారితో పాటు జవాన్లకు కరోనా సోకడంతో భవనాన్ని మూసివేశారు. ఇప్పటివరకూ 31వ బెటాలియన్‌కు చెందిన 122 మంది జవాన్లకు కరోనా సోకింది.
దీంతో భవనాన్ని మూసివేసి పరిశుభ్ర పరిచే కార్యక్రమాలు ప్రారంభించారు. శానిటైజైషన్ ప్రక్రియ పూర్తయ్యాక భవనాన్ని తిరిగి తెరుస్తారు. అలాగే, కరోనా వైరస్ బారినపడి జవాన్లు కాంటాక్ట్ ఆయిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.