జవాను కొంపముంచిన ఫేస్‌బుక్ పరిచయం... రూ.12 లక్షలకు కుచ్చుటోపి
ఫేస్‌బుక్ పరిచయం ఓ జవాను కొంపముంచింది. బ్యాంకులోని సొమ్మును లాటీ చేసింది. అమ్మాయి పేరుతో సైబర్ చీటర్ విసిరిన వలకు ఆ జవాను బుట్టలోపడి తన బ్యాంకులో ఉన్న రూ.12 లక్షలను సమర్పించుకున్నాడు. ఈ సంఘటన ఢిల్లీలో వెలుగు చూసింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఓ వ్యక్తి సీఆర్పీఎఫ్‌లో జవానుగా పని చేస్తున్నాడు. ఈ జవానుకు ఫేస్‌బుక్‌లో ఓ సైబర్‌చీటర్ రీటా అనే అమ్మాయి పేరుతో వలవిసిరాడు. తాను ఇంగ్లండ్‌లో ఉంటంటూ, ఓ కంపెనీలో మేనేజరుగా పని చేస్తున్నట్టు నమ్మించాడు. దీనికి ఆ జవాను పడిపోయారు.
అలా కొన్నాళ్లపాటు వారిద్దరి మధ్య ఫేస్‌బుక్ చాటింగ్ జరిగింది. ఆ తర్వాత వాట్సాప్‌కు మారారు. ఇంగ్లండ్ నంబర్‌తోనే వాట్సాప్ చాటింగ్ చేస్తుండటంతో బాధితుడు ఆమె(చీటర్)చెప్పేది నిజమేనని నమ్మేశాడు. చాటింగ్ చేసిన తర్వాత నా స్నేహానికి గుర్తుగా నీకు మంచి బహుమతి పంపిస్తానంటూ నమ్మించింది.
రెండుమూడురోజుల తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులమంటూ జవానుకు ఫోన్ వచ్చింది. మీ పేరుతో ఒక పార్సిల్ వచ్చింది.. అందులో ల్యాప్‌టాప్, ఐఫోన్, డాలర్లు, యూకే పౌండ్స్, ఆభరణాలు ఉన్నాయి. అయితే వీటి విలువ భారీగా ఉంటుంది. కస్టమ్స్ క్లియెరెన్స్ చేయలేదంటూ ఫోన్ చేసిన వ్యక్తులు మాట్లాడారు.
కస్టమ్స్ క్లియెరెన్స్‌కు రూ.80 వేలు చెల్లించాలంటూ దఫద ఫాలుగా జీఎస్టీ, కరోనా క్లియెరెన్స్ సర్టిఫికెట్ కూడా కావాలంటూ నమ్మిస్తూ 15 రోజులపాటు రూ.12 లక్షలు వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించారు.
ఇంకా డబ్బులు అడుగుతుండటంతోపాటు ఇటీవల లాక్‌డౌన్ అయిన తర్వాత కూడా తాము పార్సిల్ పంపిస్తామంటూ ఫోన్ చేయడంతో అనుమానం వచ్చిన జవాన్ ఇదంతా మోసమని గ్రహించాడు. ఆ తర్వాత ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగాన్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.