శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (11:02 IST)

కరోనా వైరస్ కలకలం- ఇంటివద్దే జగనన్న గోరుముద్ద

కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో మార్చి నెలాఖరు వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలోని జగన్ సర్కారు విద్యార్థులకు నేరుగా ఇళ్లవద్దే 'జగనన్న గోరుముద్ద' కింద మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంది. బియ్యం, చిక్కీ, కోడిగుడ్లు ఇంటివద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల ద్వారా 31వ తేదీ వరకూ విద్యార్థులకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయనున్నారు.
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ బాధితులు ఏడుకు చేరారు. ఇంగ్లండ్ నుంచి విశాఖపట్నం వచ్చిన 25 ఏళ్ల యువకుడికి వైరస్ సోకింది. ఇతను ప్రస్తుతం విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు. ఆ యువకుడు మార్చి 17న ఇంగ్లండ్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో దిగి అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం 5.10 గంటలకు విశాఖ విమానాశ్రయానికి వచ్చారు.
 
విశాఖ విమానాశ్రయం నుంచి తన తండ్రితో కలిసి తగరపువలసకు కారులో వెళ్లారు. మార్చి 19న జ్వరం, ఇతర లక్షణాలు కనిపించాయి. మార్చి 21న గాయత్రి విద్యాపరిషత్ హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అదే రోజు విశాఖలోని జీజీహెచ్‌సీసీడీ ఆసుపత్రిలో చేరారు. అక్కడ ఆయన శాంపిళ్లను తీసుకున్నారు. ఇంకా చికిత్స అందిస్తున్నారు.