ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By శ్రీ
Last Modified: శనివారం, 21 మార్చి 2020 (23:35 IST)

మీకోసం, మన సమాజం కోసం ఈ ఆదివారం ఇంట్లోనే ఉండండి: భారత ఉపరాష్ట్రపతి

“కరోనా వైరస్” మరింతగా విస్తరించకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన జనతా కర్ఫ్యూలో భారతీయులంతా స్వచ్ఛందంగా పాల్గొని ఈ వైరస్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే ప్రక్రియలో భాగస్వాములు కావాలని గౌరవ భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో.. జన సమూహాలకు దూరంగా ఉండటం (సోషల్ డిస్టెన్సింగ్) ద్వారానే.. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వీలుంటుందన్నారు. 
 
సోషల్ డిస్టెన్సింగ్ ద్వారా కరోనాను అరికట్టవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు.. ఆదివారం (మార్చి 22న) జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. కరోనా వైరస్ రూపంలో దేశం ఎదుర్కొంటున్న ఈ సమస్యను ఎదుర్కొనడంలో రాజకీయ పార్టీలు, పౌరసమాజంలోని వివిధ సంస్థలు, ప్రజలందరూ సంయుక్తంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ విషయంలో మన పక్కవారిని చైతన్య పరిచేబాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.
 
 
ఉపరాష్ట్రపతి భారత ప్రజలకు ఇచ్చిన పిలుపులోని అంశాలు:
 
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా దుష్ప్రభావం చూపుతోంది. అన్ని దేశాలకు ఇది సవాల్ విసురుతోంది. భారత్ సహా ఇతర దేశాలన్నీ కరోనా (కోవిడ్19) వికృతరూపంతో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టాలన్న లక్ష్యంతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం అసాధారణ చర్యలు తీసుకుంటోంది. 
 
భారతీయుల ఆరోగ్య సంరక్షణ కోసం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఏర్పాట్లు కూడా చేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులకు భారతదేశం అందిస్తున్న చికిత్సను, కరోనాను అరికట్టేందుకు భారత్‌లో జరుగుతున్న ప్రయత్నాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది. అంతమాత్రాన మనం అలసత్వానికి చోటివ్వకూడదు. ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలను మరింత విస్తృత పరిచడంలో భాగస్వాములవ్వాలి. 
 
కరోనా విస్తృతిలో మూడోదశ అయిన సామాజిక అంటు (కమ్యూనిటీ కంటామినేషన్) రాకుండా మనల్ని మనం కాపాడుకుందాం. వచ్చే మరికొద్ది వారాలు మనకు అత్యంత కీలకం, రెండోదశ నుంచే వెనక్కు వెళ్లేలా చేయాల్సిన తక్షణావసరం ఉంది.
 
జన సమూహాలకు దూరంగా ఉండటం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల సూచన మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం భారతీయులంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తద్వారా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మనం చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. 
 
సూచించిన సమయంలో ఇంట్లోనే ఉండటం ద్వారా వైరస్ చనిపోతుంది. తద్వారా సామాజిక అంటు శృంఖలాన్ని కొనసాగకుండా ఆపేసినట్లవుతుంది. ఇది మీతోపాటు మీ సమాజాన్ని పరిరక్షించుకోవడానికి తోడ్పడుతుంది. అందుకే దేశ ప్రజలందరినీ నేను కోరుతున్నదొక్కటే.. దయచేసి ఆదివారం మీరెవరూ ఇళ్లలోనుంచి బయటకు రాకండి. అలాంటప్పుడే ప్రపంచదేశాలకు, ప్రభుత్వాలకు, ప్రజలకు సవాల్ విసురుతున్న కరోనాను ఎదుర్కునేందుకు వీలవుతుంది. 
 
ఇలాంటి అత్యంత కీలకమైన సమయంలో.. అన్ని రాజకీయ పార్టీలు, పౌరసమాజ సంస్థలతోపాటు ప్రజలందరూ సంయుక్తంగా ఈ మహత్కార్యంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నాను.
 మనమంతా ఒక్కటే.. మనమంతా కలిసికట్టుగా కరోనాను తరిమేసే యజ్ఞంలో భాగస్వాములవుదాం.
 రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి మనమంతా ఐకమత్యంతో ముందుకెళదాం.
 
 పారిశుద్ధ్యాన్ని పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండటం ద్వారా  కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగస్వాములవడం, దీంతోపాటు పక్కనున్నవారిని చైతన్య పరచడం ప్రతి భారతీయుడి బాధ్యత.
 
కరోనా వ్యాప్తి వాస్తవంగానే ప్రమాదకర పరిస్థితి. కానీ ప్రభుత్వం చేసిన పలు సూచనలను పాటించడం ద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు.. దేశం, సమాజం సంరక్షణ కోసం బాధ్యతాయుతంగా మెలగడం ప్రజలు, ప్రజాప్రతినిధుల సంయుక్త బాధ్యత. మనమంతా ఇళ్లలోనే ఉందాం. సెలవు కదా అని బయటకు, తీర్థయాత్రలకు కుటుంబసమేతంగా వెళ్లాలన్న ఆలోచనలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకుందాం. 
 
స్వచ్ఛతే.. మతం, ఆధ్యాత్మికత ముఖ్య ఉద్దేశం. అందుకే జాతిపిత మహాత్మాగాంధీ స్వచ్ఛతే దైవత్వం అన్నారు. మన మతాలు, ఆధ్మాత్మికత.. వ్యక్తిగతంగా, బహిరంగ స్వచ్ఛతను బోధిస్తాయి. ఈ సంప్రదాయాలే పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహిస్తాయి. కరోనావంటి వైరస్‌ను తరిమేసేందుకు బాటలు వేస్తాయి.
 
 ఈ వైరస్ గురించి విస్తృతమైన సమాచారం సోషల్ మీడియా ద్వారా చేరవేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో.. నివారణోపాయాలపేరుతో వస్తున్న  తప్పుడు, అనధికారిక సమాచారాన్ని ఎవరుకూడా గుడ్డిగా ఇతరులకు చేరవేయవద్దు.
 
కరోనా సమస్యను పరిష్కరించేందుకు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, ఇతరులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ సేవలందిస్తున్న వారి శ్రమను, ధైర్యాన్ని మనం గుర్తించాలి. వారిని ప్రశంసించాలి. అందుకే ఆదివారి సాయంత్రం ఐదుగంటలకు చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. ఇది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, కరోనా నిర్మూలనకోసం పనిచేస్తున్న ఇతర విభాగాల సిబ్బందికి మనోధైర్యాన్ని, కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.
 
కరోనా వైరస్‌ను అడ్డుకునే విషయంలో మన దేశం ఇప్పటికే చాలా ప్రగతి సాధించింది. మనందరి మూకుమ్మడి ప్రయత్నంతో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా చేయడం కూడా మన బాధ్యతగా భావిద్దాం.

ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కృషిచేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, వైద్య నిపుణులను, ఇతర సిబ్బందిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే ఈ వైరస్‌పై మనం విజయం సాధిస్తామని భావిస్తున్నాను.
 
మనముందు అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో జారీ అవుతున్న హెచ్చరికలను అర్థం చేసుకుంటూ, చేస్తున్న సూచనలను పాటిస్తూ.. మనమంతా ఐకమత్యంగా నిలబడి.. సవాల్ విసురుతున్న విపత్తును ధైర్యంగా ఎదుర్కుందాం. వైద్య విభాగం హెచ్చరికలు, ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును అర్థం చేసుకుని ముందుకెళ్దాం.