శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (22:51 IST)

మన దేశంలో ఈజిప్టు మమ్మీ.. అసలేం జరిగిందో తెలుసా?

జైపూర్‌లోని ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో 2,400 ఏళ్ల వయస్సు గల మమ్మీని వరదలో మునిగిపోకుండా ఉండడానికి గత 130 సంవత్సరాల తరువాత మొదటిసారి పెట్టె నుంచి బయటకు తీశారు.

ఆగస్టు 14న జైపూర్‌లో కురిసిన వర్షాలకు మ్యూజియంలోకి నీరు ప్రవేశించింది. వరదనీరు మోకాలి లోతుకు చేరుకోవడంతో పెట్టెలో భద్రపరచబడిన మమ్మీని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్లాల్సి వచ్చిందని సెంట్రల్ మ్యూజియం సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ చోలాక్ తెలిపారు.

ఆలస్యమైతే ఈజిప్ట్ నుంచి రాజస్థాన్‌కు 130 ఏండ్ల క్రితం తెచ్చిన ఈ మమ్మీ శాశ్వతంగా నాశనం అయ్యేదని ఆయన తెలిపారు. అందువల్ల గాజు పెట్టెను పగులగొట్టి మమ్మీని సురక్షిత ప్రదేశంలో ఉంచామని ఆయన తెలిపారు

ఆల్బర్ట్ హాల్ మ్యూజియంలో ప్రదర్శించబడిన ఈ మమ్మీని కైరో నుంచి 130 సంవత్సరాల క్రితం తీసుకువచ్చారు. ఇది టుటు అనే మహిళది. ఈజిప్టులోని పురాతన నగరమైన పనోపోలిస్ అఖ్మిన్ ప్రాంతంలో ఇది కనుగొనబడింది.

ఏప్రిల్ 2017లో ఈ మమ్మీని జైపూర్ లోని ఆల్బర్ట్ హాల్ నేలమాళిగకు మార్చారు. దాని చరిత్ర, జనన-మరణ, ఎక్స్‌రే తదితర వివరాలను మ్యూజియంలో ఉంచారు.