ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 16 జులై 2020 (06:43 IST)

దేశంలోనే తొలిసారిగా ఏపీలో 'ఫిష్ ఫీడ్ చట్టం'

ఆక్వా ఫీడ్ ఉత్పత్తిలో నాణ్యతా నియంత్రణా చర్యలను పటిష్టంగా అమలు చేసి నకిలీలు, నాసిరకం ఉత్పత్తుల బారి నుండి రైతులకు రక్షణ కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం 2020ని  తీసుకురావడానికి తొలి అడుగు పడింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందని సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ మరియు ఎక్స్ అఫీషియో కార్యదర్శి తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.

ప్రధానంగా ఆక్వా సాగులో 60 శాతం వ్యయం ఫీడ్ కు ఖర్చు అవుతుందని, ఆక్వా కల్చర్ వెంచర్‌లో లాభదాయకత ఎక్కువగా ఫీడ్ నాణ్యతపై ఆధారపడి ఉంటుందన్నారు. గతంలో నాణ్యమైన ఫిష్ ఫీడ్ లేని కారణంగా ఆక్వా రైతులు విపరీతంగా నష్టపోయారని, అందుకే ఆక్వా రైతులకు మేలు చేకూర్చేలా ఫిష్ ఫీడ్ నాణ్యతను నియంత్రించి, సరైన ధరకే రైతులకు సరైన సమయంలో, సరైన పరిమాణంలో అందేలా ఈ చట్టం ఉపకరిస్తుందని అన్నారు.

రాష్ట్రంలో ఆక్వాటిక్ ఫీడ్ పరిశ్రమ వ్యాపార పరిమాణం సుమారు రూ. 17,000 కోట్లకు పైగా ఉందన్నారు. రాష్ట్రంలో 9 తీరప్రాంత జిల్లాల్లో సుమారు 1.95 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా సాగు చేస్తున్నారన్నారు. దేశంలో మొత్తం రొయ్యల ఉత్పత్తిలో 66.67 శాతం ఆంధ్రప్రదేశ్ నుండే జరుగుతుందని, ప్రతి సంవత్సరం 20 లక్షల మెట్రిక్ టన్నుల చేపలను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారన్నారు.  

ముడి ప్రోటీన్ విలువను కృత్రిమంగా పెంచడానికి కొంత మంది ఫిష్ ఫీడ్ తయారీదారులు యూరియా వంటి పదార్దాలను, కొన్ని జీర్ణంకాని పదార్థాలను కలపడం వంటి చట్టవిరుద్ధమైన పద్ధతులను ఆశ్రయించి నాసిరకం, నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నందున ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు దిగుబడులు తగ్గి ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.

ఆక్వాటిక్ ఫీడ్‌లో నాణ్యతా నియంత్రణ కోసం నియంత్రణ విధానం రాష్ట్రంలో ఇప్పటి వరకు లేదని, ఫిష్ ఫీడ్ పరిశ్రమలో ఈ అనైతిక మరియు చట్టవిరుద్ధమైన పద్ధతులను నివారించడానికి, ఆక్వాకల్చర్ రైతుల ప్రయోజనాల కోసం ఆక్వాటిక్ ఫీడ్లలో నాణ్యతా నియంత్రణ చర్యలను అమలు చేయడానికి, “ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) ఆర్డినెన్స్, 2020” ను దేశంలో మొదటి సారిగా తీసుకురావడం జరిగిందన్నారు.

ఇప్పటి వరకు బంగ్లాదేశ్, కొరియా, కెన్యా, ఫిలిప్పీన్స్, శ్రీలంక వంటి దేశాలలో మాత్రామే ఫిష్/యానిమల్ ఫీడ్ చట్టాలు ఉన్నాయని, భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఫిష్ ఫీడ్ చట్టం  తీసుకురాలేదని తెలిపారు. లైసెన్స్ లేనివారు ఫిష్ ఫీడ్ తయారు చేయడం నేరమని, ప్రస్తుతం ఉన్న ఫిష్ ఫీడ్ తయారీదారులందరూ లైసెన్స్ లేదా ఎండార్స్ మెంట్ పొందడానికి 4 నెలల సమయం ఇవ్వడం జరిగిందన్నారు.

లైసెన్స్ జారీ ప్రక్రియ, ఆమోదం అంతా ఆన్‌లైన్‌లో చేయబడుతుందని, ఇప్పటికే ఉన్న లైసెన్స్ లను 15 రోజుల్లోపు ఆమోదిస్తారని తెలిపారు. లైసెన్స్ వ్యవధి శాశ్వతంగా నిర్ణయించడంతో పాటు లైసెన్స్ ఫీజును ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా రూ.0.10 లక్షల నుండి రూ.2.50 లక్షల వరకు నిర్ణయించారన్నారు.

నాణ్యతకు సంబంధించిన ఉల్లంఘనల విషయంలో సస్పెన్షన్, లైసెన్స్ రద్దు చేయటం తో పాటు ఆస్తిని స్వాధీనం చేసుకోవడం, జప్తు చేయడం జరుగుతుందని, సంస్థతో పాటు నామినేటెడ్ వ్యక్తికి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ ఉంటుందని విజయ్‌కుమార్ రెడ్డి తెలిపారు.