'ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్'... ఐక్యత - సామరస్యం కోసం కొత్త మిషన్.. మోడీ
'ఏక్ భారత్ - శ్రేష్ఠ్ భారత్' పేరుతో ఐక్యత సామరస్యం కోసం కొత్త మిషన్‌ను ప్రారంభించనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. ఇందుకోసం దేశ ప్రజల నుంచి ఆయన సూచనలు, సలహాలు కోరారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా 'ఏక్ భారత్, శ్రేష్ఠ్' భారత్ గురించి చెప్పాను. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్‌కు ఒక పథక రూపం ఇవ్వాలని భావిస్తున్నట్టు తన నెలవారీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో పేర్కొన్నారు.
ఆ పథకం రూపం, దానికి ఒక లోగో, ప్రజల భాగస్వామ్యంపై 'మై గవ్ డాట్' కామ్‌లో సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఐక్యత, సామరస్యం అనే మంత్రంతో ప్రతి భారతీయుడితో ఎలా అనుసంధానమవ్వాలో సూచించాలని కోరారు. దేశంలో పెరిగి పోతున్న అసహనంపై ఆరోపణల నేపథ్యంలో ఐక్యత, సామరస్యాల సంస్కృతి బలోపేతానికి ఒక పథకం అమలుచేయాలన్న ప్రధాని ప్రతిపాదించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అలాగే, ప్రజలు అవయవదానం చేయడానికి ముందుకు వస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని ప్రధాని పిలుపునిచ్చారు. వైకల్యంగలవారు తమ బలహీనతలను అధిగమించే క్రమంలో ఇతరులకు స్ఫూర్తిగా మారగలరన్నారు. అవయవదానంపై దేశ వ్యాప్తంగా విస్తృత స్థాయిలో ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
భూతాపం ఇప్పటికే విపత్తులకు కారణమవుతోందన్నారు. భూమి ఉష్ణోగ్రత పెరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సౌరశక్తి పరికరాల వినియోగం ద్వారా ప్రజలు ఇంధన పొదుపును పాటించాలని సూచించారు. వాతావరణ మార్పులకు సంపన్న దేశాలు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలను బాధ్యులుగా చేస్తున్నాయన్నారు. సంపన్న దేశాలే కొన్ని శతాబ్దాలుగా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయని ఆరోపించారు. వాతావరణ మార్పులపై పోరాటంలోనూ ఆ దేశాలు నిధులు సమకూర్చడం, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా సహకరించాలని సూచించారు.