మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2016 (18:34 IST)

సీఎం ఇంట్లో పని చేసే పనిమనిషికి అన్నాడీఎంకే పగ్గాలు అప్పగిస్తారా : శశికళ పుష్ప ప్రశ్న

ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో గత 25 యేళ్లుగా పనిచేస్తున్న ఓ పనిమనిషికి అన్నాడీఎంకే పగ్గాలు ఎలా అప్పగిస్తారని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా అన్నాడీఎంకే నేతలను ప్రశ్నించార

ముఖ్యమంత్రి జయలలిత నివాసంలో గత 25 యేళ్లుగా పనిచేస్తున్న ఓ పనిమనిషికి అన్నాడీఎంకే పగ్గాలు ఎలా అప్పగిస్తారని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్పా అన్నాడీఎంకే నేతలను ప్రశ్నించారు. అదేసమయంలో జయలలిత ఆరోగ్యానికి సబంధించి నిజాలు బహిర్గతం కావాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని జయలలిత ప్రియనెచ్చెలి శశికళకు కట్టబెట్టబోతున్న విషయం తెల్సిందే. 
 
దీనిపై శశికళ పుష్ప స్పందిస్తూ... శశికళ అమ్మకు 35 ఏళ్లుగా సేవలు చేశారని తనకు తెలుసని అన్నారు. అలా అని పార్టీ అధినేత్రి పదవి ఎలా కట్టబెడతారంటూ ఆమె నిలదీశారు. తన ఇంట్లో 25 ఏళ్లుగా పని చేస్తున్న వ్యక్తికి తన పదవిని కట్టబెడతానా? అని ఆమె ప్రశ్నించారు. కేవలం శశికళ గ్రూపు కారణంగానే అమ్మకు ఏదో జరిగిందని అంతా నమ్ముతున్న  ప్రస్తుత తరుణంలో, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారని ఆమె నిలదీశారు.
 
అంతేకాకుండా ఆమెకు పార్టీలో కనీసం సభ్యత్వం కూడా లేదని, అలాంటి శశికళ నటరాజన్‌ను ఏ అర్హతతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేస్తారని ఆమె ప్రశ్నించారు. ఇంత చేసి, ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టినా, పార్టీని నడిపించేది మాత్రం ఆమె భర్త నటరాజన్ అన్న విషయంలో ఎలాంటి సందేహం లేదన్నారు. శశికళను ఏ దశలోనూ అమ్మ పార్టీ ప్రధాన కార్యదర్శిని చెయ్యాలని ఆలోచించలేదని ఆమె స్పష్టం చేశారు. తన తుది శ్వాస వరకు శశికళపై పోరాటం చేస్తానని పుష్ప ప్రకటించారు. ఆమె కుట్రలు సాగనివ్వబోనని స్పష్టం చేశారు.