గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 ఏప్రియల్ 2017 (12:54 IST)

పార్టీలో శశికళ వాసనే ఉండకూడదు... మా ధర్మయుద్ధానికి తొలి విజయమిది: మాజీ సీఎం పన్నీర్

అన్నాడీఎంకే నుండి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. ఆమె కుటుంబం దూరంకావడం తాము చేస్తున్న ధర్మయుద్ధానికి లభించిన తొలి విజయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అన్నారు.

అన్నాడీఎంకే నుండి దివంగత జయలలిత ప్రియనెచ్చెలి శశికళతో పాటు.. ఆమె కుటుంబం దూరంకావడం తాము చేస్తున్న ధర్మయుద్ధానికి లభించిన తొలి విజయమని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం అన్నారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ పార్టీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడంపై ఆయ
న సంతోషం వ్యక్తం చేశారు. 
 
బుధవారం ఉదయం తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ జయ మృతి తర్వాత పార్టీని కబళించిన శశికళ, ఆమె కుటుంబీకులను తరిమికొట్టేంతవరకూ తన పోరాటం ఆగదని గతంలో ప్రకటించానని, ఇప్పుడా లక్ష్యం నెరవేరిందని అన్నారు. పార్టీలో రెండు వర్గాల విలీనానికి అనువుగా చర్చలు జరుపుతామన్నారు.
 
అన్నాడీఎంకేలో శశికళ కుటుంబం పెత్తనం సరికాదని, పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రస్తుతం కార్యక్రమాలు సాగుతున్నాయని, ఆ కుటుంబాన్ని పార్టీ నుంచి తొలగించేవరకు ధర్మయుద్ధాన్ని కొనసాగిస్తానని గతంలోనే చెప్పానన్నారు. ఆ ప్రకారం అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నుంచి దినకరన్‌ కుటుంబాన్ని దూరంగా పెడుతున్నామని ప్రకటన రావడం తమ ధర్మయుద్ధంలో తొలి విజయమన్నారు. 
 
ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, అన్నాడీఎంకే(అమ్మ) వర్గంతో చర్చల అనంతరం ప్రజలకు ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఈ ఏడాది ఫిబ్రవరి 7న శశికళ వర్గంపై తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో అన్నాడీఎంకేలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే. 
 
మంగళవారం రాత్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి డి.జయకుమార్‌ కీలక ప్రకటన నేపథ్యంలో అన్నాడీఎంకే నుంచి టీటీవీ దినకరన్‌ కుటుంబం బయటకు వెళ్లిపోయినట్లయింది. దీంతో పన్నీర్‌సెల్వం ప్రధాన డిమాండ్‌ను మన్నించినట్లవడంతో ఇరువర్గాల మధ్య విలీన చర్చలకు తెరలేచింది.