1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 డిశెంబరు 2015 (05:41 IST)

నిబంధనలు అతిక్రమిస్తే... చేతికి పువ్వులు.. గాంధీగిరి... సరి-బేసి విధానంపై కేజ్రీవాల్

జనవరి ఒకటో తేదీ నుంచి దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు సరి-బేసి సంఖ్యల విధానాన్ని అమలుచేయనున్నారు. ముఖ్యంగా... నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కొంతమేరకు అయినా తగ్గించేంకు గాను ఢిల్లీ ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుచేయనుంది. 
 
అయితే, సరి-బేసి సంఖ్య విధానాన్ని వాహనదారులు నిబంధనల్ని అతిక్రమిస్తే వారితో దురుసుగా మాట్లాడటానికి బదులుగా పువ్వులివ్వాలని ట్రాఫిక్ అధికారులకు, వాలంటీర్లకు ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఈ పద్ధతి అమలు విషయంలో ట్రాఫిక్‌ పోలీసులకు ఆయన మార్గనిర్దేశం చేస్తూ కొన్ని హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేశారు. 
 
'వాహనచోదకుల పట్ల దురుసుగా ప్రవర్తించ వద్దు. ప్రజల మనస్సుల్ని మార్చేందుకు ప్రయత్నించండి. చేతిలో ఎర్రలైటు, ప్లకార్డు పట్టుకోండి. ట్రాఫిక్‌ నిబంధనల్ని అతిక్రమిస్తున్న వారిపై ఆ ఎర్రలైటు వెయ్యండి. వారికి పువ్వులివ్వండి. ఇంటికి వెళ్లిపోవాల్సిందిగా సూచించండి. వారితో గొడవ పడటం, చలానాలు రాయడం ముఖ్యం కాదు' అంటూ చెప్పుకొచ్చారు. 
 
ఈ పద్ధతి అమల్లోకి వస్తే బేసి సంఖ్య గల తేదీల్లో బేసి నెంబర్‌ ప్లేట్‌ గల వాహనాలు, సరి సంఖ్య గల తేదీల్లో రిజిస్ట్రేషన్‌ నెంబరు గల వాహనాలు మాత్రమే ఢిల్లీలో తిరగడానికి అనుమతి ఇస్తారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ పద్ధతిని అవలంబిస్తారు.