శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (11:30 IST)

నంబర్ ప్లేట్ లేదనీ రూ.27 లక్షల ఫైన్.. ఎక్కడ?

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఓ కారు యజమానికి ట్రాఫిక్ పోలీసులు తేరుకోని షాకిచ్చారు. నంబరు ప్లేటు లేకపోవడంతో ఏకంగా రూ.27.68 లక్షల అపరాధం విధించారు. దేశంలో కొత్త మోటారు వాహన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక వాహనచోదకుడికి విధించి అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి విదేశం నుంచి పోర్షే రకం కారును దిగుమతి చేసుకున్నాడు. ఈ కారులో రోడ్డుపైకి వచ్చాడు. ఆ సమయంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలో నిమగ్నమైవున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన పోర్షే కారును ఆపారు. 
 
కారుకు నంబర్ ప్లేటుతో పాటు... ఉండాల్సిన ముఖ్యమైన పత్రాలు లేవని తొలుత రూ.9.80 లక్షల అపరాధం విధించారు. పిమ్మట ఆరు వారాల తర్వాత ఈ మొత్తాన్ని సమీక్షించి జరిమానాను రూ.27.68 లక్షలకు పెంచుతున్నట్టు ఓ లేఖను ఇంటికి పంపించారు. దీంతో ఆ యజమాని మరోమార్గం లేక.. ఆ మొత్తాన్ని చెల్లించి, కారును ఇంటికి తెచ్చుకున్నారు. 
 
దేశంలో ఇదే అత్యధిక జరిమానా అని అహ్మదాబాద్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాహనం నడిపే సమయంలో వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (ఆర్సీ), వాహన బీమా పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికేట్ తప్పనిసరని అన్నారు. ఇవి లేకుంటే భారీ అపరాధాలు చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.