మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (15:12 IST)

హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబానికి సర్కారు ఉద్యోగం.. రూ.25 లక్షల నగదు

హత్రాస్ అత్యాచార బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్టు తెలిపారు. అలాగే, వారి కుటుంబంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగంతోపాటు ఇల్లు కూడా మంజూరు చేయనున్నట్టు పేర్కొన్నారు. 
 
అత్యాచార మృతురాలి తండ్రితో సీఎం యోగి ఆదిత్యనాథ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. 
 
కాగా, హత్రాస్ జిల్లాలో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులు అనంతరం ఆమెను దారుణంగా హింసించారు. ఘటన గురించి ఎవరికీ చెప్పకుండా ఉండేందుకు ఆమె నాలుకను తెగ్గోశారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మొన్న కన్నుమూసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.