గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:35 IST)

హథ్రాస్‌ కేసు విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. సత్వర న్యాయం చేస్తాం : సీఎం యోగి

హథ్రాస్ హత్యాచార బాధితురాలి కేసులో సత్వర న్యాయం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని హథ్రాస్‌లో ‌20 యేళ్ళ దళిత యువ‌తిపై అగ్రకులానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మేగాక నాలుక కోసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మయ్యారు. ఈ బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. 
 
దీంతో సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ కేసులో నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని స్పష్టం చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు కోసం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌రిపి వారం రోజుల్లో నివేదిక స‌మ‌ర్పించ‌నుంద‌ని యోగీ తెలిపారు. 
 
అలాగే, ఈ కేసులో బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం జ‌రిగేలా చూస్తామ‌న్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు విచార‌ణ జ‌రిపిస్తామ‌ని చెప్పారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని ప్ర‌ధాని కూడా త‌న‌ను ఆదేశించార‌ని యోగీ తెలిపారు. 
 
మరోవైపు, హథ్రాస్ యువతి అత్యాచార ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప్రియాంక గాంధీ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నేరాలు పెరిగిపోతున్నాయ‌ని ఆమె మండిప‌డ్డారు. సీఎం ప‌ద‌విలో కొన‌సాగే నైతిక హ‌క్కు యోగికి లేద‌న్నారు. 
 
హథ్రాస్ ఘ‌ట‌న‌కు బాధ్య‌త వ‌హిస్తూ సీఎం ప‌ద‌వి నుంచి యోగి త‌ప్పుకోవాల‌ని డిమాండ్ చేశారు. మృతురాలి అంత్య‌క్రియ‌ల‌ను ఆమె కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో నిర్వ‌హించక‌‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. బాధితురాలి కుటుంబ స‌భ్యుల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు మాన‌వ హ‌క్కుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 
 
తాను బాధితురాలి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడిన‌ప్పుడు తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యార‌ని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. త‌మ కుటుంబానికి న్యాయం కావాల‌ని ఆమె తండ్రి డిమాండ్ చేస్తున్న‌ట్లు ప్రియాంక తెలిపారు.