మరో 206 రైళ్లకు అనుమతినిచ్చిన యూపీ సర్కారు!
వలస కార్మికుల తరలింపునకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో 206 రైళ్లను తమ రాష్ట్రంలోకి అనుమతిచ్చేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సర్కారు సమ్మతం తెలిపింది. ఈ మేరకు యూపీ హోంశాఖ అదనపు కార్యదర్శి అనివాష్ అవస్థితి వెల్లడించారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వలస కార్మికులు, కూలీలతో వచ్చే మరో 206 రైళ్ళు తమ రాష్ట్రంలోకి ప్రవేసించేందుకు అనుమతి ఇచ్చామని, ఇవి వచ్చే 48 గంటల్లో తమ రాష్ట్రానికి చేరుకుంటాయని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఇంతవరకూ 838 శ్రామిక్ రైళ్లు యూపీకి వచ్చాయని, కొత్తగా 206 రైళ్లకు అనుమతించడం ద్వారా మొత్తం 1,044 రైళ్లను తాము ఏర్పాటు చేసినట్టు అవుతుందని తెలిపారు.
మరోవైపు, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‍ను కట్టడి చేయడంలో అధికారులు సఫలమయ్యారని చెప్పొచ్చు. ఫలితంగా బుధవారం నమోదైన 23 కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసులు 4926గా ఉన్నాయి. ఇందులో 123 మంది ప్రాణాలు కోల్పోయారు.