బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 మే 2020 (17:16 IST)

లాక్డౌన్‌తో పుట్టింటిలో చిక్కుకున్న భార్య - రెండో పెళ్లి చేసుకున్న భర్త

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ సంఘటన జరిగింది. కట్టుకున్న భార్య పుట్టింటిలో చిక్కుకుని పోయింది. అదికూడా లాక్డౌన్ కారణంగా. దీంతో ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇది బరేలీ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లాకు చెందిన నయీమ్ మన్సూరీ అనే వ్యక్తి నసీమ్ అనే మహిళను గత 2013లో వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. లాక్డౌన్‌కు ముందు మార్చి 19న ఆమె తన తల్లిదండ్రులను చూసేందుకు పుట్టింటికి వెళ్లింది. 
 
ఆ తర్వాత మార్చి 24వ తేదీ రాత్రి నుంచి లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో ప్రజా రవాణా మొత్తం ఆగిపోవడంతో ఆమె పుట్టింటిలోనే ఉండిపోవాల్సివచ్చింది. కానీ, భర్త మాత్రం ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు. భార్య వెళ్లి పుట్టింటిలోనే ఉండిపోయిందని ఆగ్రహించసాగాడు. 
 
ఈ క్రమంలో నయీమ్ మన్సూరీ తన బంధువుల అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. పైగా, ఈమె మన్సూరీ మాజీ ప్రియురాలు కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న నసీమ్, తనకు సహాయం చేయాలంటూ 'మేరా హక్' అనే స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. 
 
లాక్డౌన్‌లో నసీమ్ చిక్కుకుపోతే, మరో వివాహం చేసుకుని ఆమెకు అన్యాయం చేశాడని, ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తామని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఫర్హాత్ నఖ్వీ అంటున్నారు. పైగా, ఈ విషయాన్ని ఆ స్వచ్ఛంధ సంస్థ నిర్వాహకులు పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లారు.