మంగళవారం, 4 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 సెప్టెంబరు 2025 (13:33 IST)

ఓట్ల దొంగతనం కుట్ర : ఇపుడు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నా... త్వరలో బాంబు పేలుస్తా : రాహుల్ గాంధీ

rahul gandhi
ఓట్ల దొంగతనం వెనుక ఉన్న శక్తిని భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కాపాడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్ల చోరీ జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని తాను ఆషామాషీగా చెప్పడం లేదని పక్కా ఆధారాలతో చెబుతున్నట్టు తెలిపారు. పైగా, ఓట్ల చోరీకి సంబంధించి ఇపుడు విడుదల చేసిన వీడియో కేవలం ట్రైలర్ మాత్రమేనని, మున్ముందు హైడ్రోజన్ బాంబు పేలుస్తానని తెలిపారు. 
 
కర్నాటక రాష్ట్రంలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఘటనను ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అక్కడ ఏకంగా 6,018 ఓట్లను అక్రమగా తొలగించేందుకు ప్రయత్నం జరిగిందని రాహుల్ ఆరోపించారు. ఇది అనుకోకుండా బయటపడిన ఒక ఉదంతం మాత్రమేనని చెప్పారు. ఆలంద్‌లో మొత్తం ఎన్ని ఓట్లు తొలగించారో మాకు తెలియదు.. కానీ 6,018 ఓట్ల తొలగింపు వ్యవహారం మాత్రం పట్టుబడింది అని ఆయన వివరించారు. 
 
ఈ కుట్ర ఎలా బయటపడిందో కూడా ఆయన వివరించారు. ఒక బూత్ లెవల్ అధికారి తన బంధువు పేరును ఓటర్ల జాబితాలో కనిపించకపోవడంతో ఆరా తీశారు. ఆమె బంధువు ఓటును ఒక పొరుగు వ్యక్తి దరఖాస్తు ద్వారా తొలగించినట్టు రికార్డుల్లో ఉంది. ఆ పొరుగు వ్యక్తిని అడగ్గా.. తనకేమీ తెలియదని, తాను ఏ దరఖాస్తు చేయలేదని చెప్పారు. అంటే ఒటు తొలగించిన వ్యక్తికి తెలియదు, ఓటు పోగొట్టుకున్న వ్యక్తికీ తెలియదు. మధ్యలో మరేదో శక్తి ఈ ప్రక్రియను హైజాక్ చేసి ఓట్లను తొలగించింది అని రాహుల్ గాంధీ ఆరోపించారు. 
 
ఈ సందర్భంగా బీజేపీ, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేను ఈ మాటను తేలిగ్గా అనడం లేదు. లోక్‌సభ ప్రతిపక్ష నేతగా చెబుతున్నాను. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓట్ల దొంగలకు రక్షణ కవచంలా ఉన్నారు. ఇది పచ్చి నిజం. ఇందులో ఎలాంటి గందరగోళం లేదు అని ఆయన తీవ్రంగా ఆరోపించారు. పైగా, తాను గతంలో చెప్పినట్టుగా హైడ్రోజన్ బాంబు లాంటి బలమైన సాక్ష్యాలను బయటపెడతామని రాహుల్ తెలిపారు. ఇపుడు వెల్లడించింది కేవలం ట్రైలర్ మాత్రమేనని అసలు విషయం ముందుందని ఆయన పేర్కొన్నారు.