బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (16:01 IST)

మలేషియాకు మలేరియాకు మాత్రలు...

మలేషియాకు మలేరియా మాత్రలను భారత్ పంపించనుంది. కరోనాపై పోరాడుతున్న ప్రపంచ దేశాలకు సహాయం అందించేందుకు భారత్‌ ముందుకువచ్చిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా కరోనాను కట్టడి చేయడానికి ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మెడిసిన్‌ను మలేషియాకు అందించనుంది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం 89,100 ట్యాబ్లెట్లను ఎగుమతి చేయడానికి భారత్‌ అంగీకరించిందని మలేషియా విదేశాంగ సహాయ మంత్రి కమరుద్దిన్‌ జాఫర్‌ వెల్లడించారు. తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను అందించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరడంతో ఈ ట్యాబ్లెట్ల ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్‌ పాక్షికంగా తొలగించిన విషయం తెల్సిందే. 
 
మరోవైపు, ఐరోపాలో 10 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్‌ పుట్టింది చైనాలో అయినా ఎక్కువగా ప్రభావితమైనది మాత్రం ఐరోపా దేశాలు. ఖండంలోని ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్యలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచాయంటే అక్కడి పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో ఊహించుకోవచ్చు. 
 
ఐరోపాలో ఇప్పటివరకు 10,03,284 కరోనా కేసులు నమోదవగా, 84,465 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 20,08,251 కేసులు నమోదవగా, 1,27,168 మంది మరణించారు. ఈ ప్రాణాంతక మహమ్మారి వల్ల ఇప్పటివరకు స్పెయిన్‌లో 18255 మంది, ఇటలీలో 21,067 మంది, ఫ్రాన్స్‌లో 15,729 మంది, జర్మనీలో 3495 మంది మరణించారు.