శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2020 (15:41 IST)

కరోనా వైరస్ సరే.. కొత్తగా బ్యాట్ కరోనా వైరస్...

ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతున్నాయి. ఇప్పటికే 210 దేశాలకు పైగా ఈ వైరస్ వ్యాపించింది. అయితే, ఇపుడు కొత్తగా మరో వైరస్ వెలుగులోకి వచ్చింది. అది బ్యాట్ కరోనా వైరస్. 
 
మనుషుల్లో కరోనా విజృంభణ నేపథ్యంలో రెండు రకాల గబ్బిలాల జాతుల్లో 'బ్యాట్ కరోనా వైరస్‌'ను తొలిసారి గుర్తించినట్టు భారతీయ పరిశోధుకులు వెల్లడించారు. కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరి, తమిళనాడుల్లో గబ్బిలాల్లో ఈ వైరస్‌ను తొలిసారి గుర్తించినట్లు వివరించారు. ఈ విషయంపై భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ప్రకటన చేసింది.
 
అయితే, బ్యాట్‌ కరోనా వైరస్‌ మనుషులకు హానికరమన్న ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టతనిచ్చింది. 25 గబ్బిల్లాల్లో ఈ వైరస్‌ను గుర్తించారు. ప్రస్తుతం మానవాళిని పీడిస్తోన్న కరోనా వైరస్‌కు, బ్యాట్‌ కరోనా వైరస్‌కు ఎలాంటి సంబంధం లేదని ఐసీఎంఆర్‌ అధ్యయనం జరిపి తెలిపింది. ఇండియన్ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌లో బ్యాట్‌ కరోనా వైరస్‌పై పూర్తి వివరాలను వెల్లడించారు. 
 
మహారాష్ట్రలోని పుణేలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో కలిసి నిర్వహించిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడైనట్లు ఐసీఎంఆర్‌ అందులో పేర్కొంది. కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, పుదుచ్చేరిలోని రౌసెటస్, టెరోపస్ (ఇండియన్‌ ఫ్లయింగ్‌ ఫాక్స్‌) అనే రెండు రకాలకు చెందిన గబ్బిలాల్లో 'బ్యాట్‌ కరోనా వైరస్‌'ను గుర్తించినట్లు తెలిపింది.