సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 24 జులై 2017 (05:36 IST)

మైదానంలో ఓడి విలపించారు.. కోట్లమంది హృదయాలను గెల్చుకున్నారు.. మీ స్ఫూర్తిని మర్చిపోలేం మిథాలీ అండ్ టీమ్

మైదానంలో వారు ఏడుస్తుంటే అంతవరకూ టీవీల్లో అతుక్కుపోయి చూసిన కోట్లమంది ప్రేక్షకులు వారితో పాటు విలపించారు. ముఖ్యంగా మిన్నువిరిగి మీద పడినా చలించని, మిస్ కూల్ లాగా కొండంత ధైర్యాన్ని ప్రదర్శించే కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం కంట తడిపెట్టిన క్షణాన.. 18 సంవత్

ఒక అపూర్వ విజయానికి చేరువలోకి వచ్చి అయిదే అయిదు ఓవర్ల ఆటతో దురదృష్టవశాత్తూ తలవంచిన టీమిండియా మహిళా జట్టు మైదానంలోనే కుప్పకూలి విలపిస్తుంటే కోట్లమంది భారతీయుల హృదయాలు బద్దలయ్యాయి. మైదానంలో వారు ఏడుస్తుంటే అంతవరకూ టీవీల్లో అతుక్కుపోయి చూసిన కోట్లమంది ప్రేక్షకులు వారితో పాటు విలపించారు. ముఖ్యంగా మిన్నువిరిగి మీద పడినా చలించని, మిస్ కూల్ లాగా కొండంత ధైర్యాన్ని ప్రదర్శించే కెప్టెన్ మిథాలీ రాజ్ సైతం కంట తడిపెట్టిన క్షణాన.. 18 సంవత్సరాలుగా కంటూవచ్చిన కల ఒక దురదృష్టకరమైన క్షణంలో ఆవిరైనప్పుడు ఆమె ముఖంలో విచారం వ్యక్తమైన క్షణాన భారత అభిమానుల హృదయాలు చలించిపోయాయి. ఎందుకంటే.. మహిళా క్రికెట్ అంటే దూకుడు ఉండదు పాడూ ఉండదు అంటూ పట్టించుకోని వారు కూడా ఆదివారం సాయంత్రం నుంచి టీవీలకు అతుక్కుపోయారు. కారణం టోర్నీ ప్రారంభం నుంచి యావద్దేశాన్ని తమవైపు తిప్పుకున్న ఆటను ప్రదర్శించారు వారు. 
 
అందుకే అంతటి మిథాలీనే బాధ తట్టుకోలేక క్షణకాలం కంట తడి పెట్టడం మన యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉన్న ప్రధాని నరేంద్రమోదీని సైతం కదిలించినట్లుంది. ఈ మధ్యకాలంలో ఏ క్రీడా సందర్భంగానూ ఇవ్వనంత భారీ ప్రకటనతో మోదీ మన అమ్మాయిలను ఓదార్చారు. బాధపడకండని ధైర్యం చెప్పారు. మీరు అద్భుతంగా ఆడారని, ప్రపంచ కప్ వేదికగా మీలోని సత్తాను చాటారని కీర్తించారు. జట్టును చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. వాస్తవానికి ఫైనల్ ఆటకు ముందు కూడా ప్రధాని జట్టులోని ప్రతి ప్లేయర్‌ పేరుతో ట్వీట్లు చేశారు. స్ఫూర్తి నింపారు. 
 
మమ్మల్ని జయించడం నీ వల్లకాదు ఇంగ్లండ్ అంటూ టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ రెండ్రోజుల క్రితం ఆత్మస్థయిర్యంతో చేసిన ప్రకటనను కోట్లమంది అభిమానులు నమ్మారు. దానికి తగ్గట్లుగానే మహిళా క్రికెట్ వన్డే పోటీల్లోనే కనీ వినీ ఎరగని విధంగా లార్డ్స్ మైదానం కిక్కిరిసిపోయింది. పూర్తి కెపాసిటీతో  మహిళల ఫైనల్‌కు సీట్లు నిండిపోపడం ఇదే ప్రథమం. మైదానం బయట కోట్లమంది భారతీయులు వారికి మద్దతుగా నిలబడి టీవీలముందుకు వచ్చారు. 
 
అద్భుతాన్ని ఆశించిన జట్టు దానిని అందుకునే క్రమంలో ఎంతో చేరువగా వచ్చినా, చివరకు ఆ విజయం అందకుండా దూరంగా వెళ్లిపోయింది. చిరస్మరణీయ ప్రదర్శనతో ప్రపంచ క్రికెట్‌ దృష్టిని తమ వైపునకు  తిప్పుకున్న భారత మహిళల సైన్యం చివరకు గుండె పగిలే రీతిలో ఓటమిని ఆహ్వానించింది. ఎప్పుడో పన్నెండేళ్ల క్రితం చేజారిన అవకాశాన్ని ఈ సారి ఒడిసిపట్టుకునేలా కనిపించినా... ‘విమెన్‌ ఇన్‌ బ్లూ’ కడకు దానిని చేజార్చుకున్నారు.
 
ప్రపంచ కప్‌ గెలిస్తే భారత్‌లో మహిళల క్రికెట్‌ రాత మారిపోతుంది...టీమిండియా మహిళా కెప్టెన్‌ పదే పదే టోర్నీలో చెప్పిన మాట ఇది. ఫర్వాలేదు... ఫైనల్లో ఓడినా మీ ఆటకు జోహార్లు. ఈ టోర్నీలో ప్రదర్శన చాలు మీ ఆట ఎన్నో మెట్లు పైకి ఎక్కిందని చెప్పేందుకు! మీ మ్యాచ్‌ల గురించి ఇక ముందు ప్రపంచం చర్చిస్తుంది. జయాపజయాల గురించి మాట్లాడుతుంది. లార్డ్స్‌ మైదానంలో హౌస్‌ఫుల్‌గా వరల్డ్‌ కప్‌ మహిళల మ్యాచ్‌ జరిగిందంటే అది మీ ఆటపై నమ్మకంతోనే. లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయి ఆడవారి ఆట కోసం ఎదురు చూశారంటే అది మీ ఆటలోని గొప్పతనమే. ఫైనల్‌ ఓటమి తీవ్రంగా కలచివేసిందనడంలో సందేహం లేదు. కానీ వారి ఘనతను ఈ ఓటమి ఏమాత్రం తగ్గించలేదనేది సత్యం.  
 
భారత యువత విజయకాంక్షకు, ఆశల మోసులకు పాతికేళ్లు ప్రతీకగా నిలిచన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కాగా, మహిళా జట్టులో ప్రతి ఒక్కరికీ మిథాలీ రాజ్ హిమశిఖరం లాంటి స్ఫూర్తి. జట్టులో సీనియర్ సభ్యురాలి నుంచి నిన్న కాక మొన్న టీమ్‌లోకి వచ్చిన చిన్నారి అమ్మాయిలు కూడా మిథాలీ ప్రేరణతోనే తాము ఈ ఫీల్డ్ లోకి వచ్చామని చెబుతున్నారు. 18 ఏళ్ల అనుభవం, జట్టుమొత్తానికి ఆదర్శప్రాయమైన వైఖరితో నడిపించి వారి ప్రతి విజయాన్ని, అపజయాన్ని సమానంగా పంచుకునన్న కెప్టెన్.. మహిళా క్రికెట్‌లోనే నిత్య అధ్యయనశీలి, బ్యాటింగ్ కోసం ప్యాడ్ కట్టుకుని కూడా ఒత్తిడి అన్నదే లేకుండా నింపాదిగా పుస్తకం చదువుతూ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరచిన నిండు కుండ మనస్తత్వం ఆమెది. 
 
ఆమెకోసమైనా వరల్డ్ కప్ ఫైనల్‌లో మనవాళ్లు గెలిచి ఉంటే బాగుండేది. గెలుపు తీరాలకు దగ్గరై కూడా అనుభవం లేని తనంతో తొలిసారిగా పానిక్‌కు గురై దెబ్బతిన్నారు. ఇలాంటి అనుభవాన్ని స్వయంగా 2007 వరల్డ్ కప్‌లో స్వయంగా అనుభవించి లీగ్ దశలోనే టోర్నీ నుంచి తప్పుకోవలసి వచ్చిన అవమానాన్ని భరించలేక డ్రెస్సింగ్ రూమ్‌లోనే భోరున విలపించిన సచిన్  టెండూల్కర్ ఆ అనుభవంతోనే మహిళా టీమ్‌కు స్వాంతన పలికాడు. ఎన్నో అనుకుంటాం. కానీ మన ఆశలకు భిన్నంగా జరుగుతుంటుంది. క్రీడల్లో ఇది సహజం.. మీరు బాధపడకండి.. మీరు ప్రదర్శించిన ప్రతిభ అసాధారణం అంటూ సచిన్ పలికిన స్వాంతన కోట్లమంది అభిమానుల వాణిని ఒకటిగా చేసి పలికిందే అని చెప్పవచ్చు.