శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2017 (13:11 IST)

జల్లికట్టుపై చెన్నైలో అచ్చంగా హైడ్రామా జరుగుతుందట: ఓవైసీ.. ''పెటా''పై ధనుష్ ఏమన్నారంటే?

జల్లికట్టుపై చెన్నైలో అచ్చంగా హైడ్రామానే జరుగుతుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జల్లికట్టు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి కుదరనిపని అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. దేశంలో వైర

జల్లికట్టుపై చెన్నైలో అచ్చంగా హైడ్రామానే జరుగుతుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ జల్లికట్టు ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి కుదరనిపని అంటూ ఓవైసీ ట్వీట్ చేశారు. దేశంలో వైరుధ్యాలు ఉన్నాయని చెప్పేందుకు జల్లికట్టుపై తమిళనాడులో జరుగుతున్న ఉద్యమమే నిదర్శనమని ఓవైసీ అన్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 
 
ఘనత అంతా తమ పార్టీకే చెందాలని అన్నాడీఎంకే ప్రయత్నిస్తుంటే.. మరోవైపు బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత రాధాకృష్ణణ్ నేతృత్వంలో ఆ పార్టీ కార్యకర్తలు కేంద్రమంత్రి దావేతో భేటీ అయ్యారు. నిషేధిత జాబితా నుంచి ఎద్దులను తొలగించాలని వారు కోరారు. ఈ మేరకు ఒక ఆర్డినెన్స్‌ను కూడా తీసుకురావాలని వినతి చేశారు. కేంద్రంపై డీఎంకే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తోందని అసదుద్ధీన్ వ్యాఖ్యానించారు. జల్లికట్టుపై జరుగుతున్నదంతా డ్రామానే అంటూ ఓవైసీ వ్యాఖ్యానించారు. హిందుత్వ దళానికి జల్లికట్టు ఓ నిదర్శనమన్నారు
 
ఇదిలా ఉంటే.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, సినీ హీరో ధనుష్‌ తాను పెటాకు మద్దతు ఇవ్వడంలేదని స్పష్టంచేశారు. జల్లికట్టు నిర్వహణకు పెటా అడ్డుపడుతుండడంతో తమిళులు ఈ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో గతంలో పెటాకు మద్దతుగా వ్యవహరించిన పలువురు సినీ నటులు తాము ఇప్పుడు పెటాకు మద్దతు ఇవ్వడంలేదంటూ ప్రకటించేశారు. ఈ వరుసలోనే ధనుష్‌ కూడా చేరారు.
 
కొన్ని సంవత్సరాల క్రితం తనకు ఓ ఎన్జీవో పెటా అవార్డు ఇవ్వడంపై చింతిస్తున్నానని, అవమానంగా భావిస్తున్నానని ధనుష్‌ వెల్లడించారు. శాకాహారి అయిన తనకు 2012లో పెటా 'హాటెస్ట్‌ వెజిటేరియన్‌' అవార్డు ఇచ్చిందని, దాని పట్ల విచారిస్తున్నానన్నారు. తాను, తన కుటుంబసభ్యులు ఎవ్వరూ పెటాలో భాగస్వాములు కారని స్పష్టంచేశారు. ఒకవేళ దీనికి వ్యతిరేకంగా ఏదైనా ప్రచారం జరిగితే అవి కేవలం పుకార్లేనని తెలిపారు. జల్లికట్టు నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ధనుష్ కోరారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను ప్రశంసించారు.