జయను కొనియాడిన విదేశీ మీడియా.. ‘ఓ గదిలో మరణం.. ఆ పక్కగదిలోనే వారసత్వ గొడవ’ అనే వాక్యాలు...?
తమిళనాడు సీఎం బాధ్యతలు నిర్వహిస్తూ మృతి చెందిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి పట్ల యావత్తు దేశంతో పాటు విదేశాలు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. ఆమె మృతి పట్ల శ్రీలంక వంటి దేశాలు కూడా ఫ్రంట్
తమిళనాడు సీఎం బాధ్యతలు నిర్వహిస్తూ మృతి చెందిన అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతి పట్ల యావత్తు దేశంతో పాటు విదేశాలు కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశాయి. ఆమె మృతి పట్ల శ్రీలంక వంటి దేశాలు కూడా ఫ్రంట్ పేజ్ న్యూస్‌ను ప్రచురించాయి. ఇక ఇంకాస్త దూరంలో తమిళులు అధికంగా ఉన్న మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు కూడా ప్రధాన వార్తే.
కానీ, 11 కోట్ల మందికి 'అమ్మ'గా ఆమె తెచ్చుకున్న గుర్తింపు, పేదలకు అందించిన సంక్షేమ పథకాలు, ప్రపంచవ్యాప్తంగా జయలలితకు పేరు తెచ్చిపెట్టగా, ఆమె మరణాన్ని, అంత్యక్రియలనూ అంతర్జాతీయ మీడియా ఆసక్తిగా కవర్ చేసింది. ఎన్నో దేశాల మీడియా ఆమె అంతిమయాత్ర చిత్రాలు ప్రచురించాయి. ఇందులో భాగంగా "తమిళనాడు నేత మరణంతో దక్షిణ భారతాన అధికార శూన్యత" అంటూ 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రచురించింది.
'ది గార్డియన్' పత్రిక రచయిత వాసంతీ సుందరమ్ రాసిన జయలలిత జీవిత చరిత్రను ప్రస్తావిస్తూ, జయలలితను ఉక్కుమహిళగా అభివర్ణించింది. "పేరొందిన తమిళ ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూత" అంటూ సింగపూర్ కేంద్రంగా వెలుడే 'ది స్ట్రెయిట్స్ టైమ్స్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇలా ఎన్నో దేశాల్లోని పత్రికలు జయలలిత మరణవార్తను కవర్ చేశాయి.
ఇదిలా ఉంటే.. జయలలిత మృతి పట్ల తమిళనాట వివిధ రకాల వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 5న జయలలిత మృతి చెందిన నేపథ్యంలో చెన్నైలోని ఓ దుకాణం గతంలో ముద్రించిన ఓ క్యాలెండర్‌లోని వాక్యాలు చర్చనీయాంశంగా మారాయి. సదరు దుకాణం ముద్రించిన 2016 క్యాలెండరులో ఒక్కో తేదీపై తాత్వికతతో ముడిపడి ఉండే వాక్యాన్ని ముద్రించారు.
ఆ క్యాలెండరులో ఈ డిసెంబర్ 5వ తేదీ వాక్యంగా ‘ఓ గదిలో మరణం.. ఆ పక్కగదిలోనే వారసత్వ గొడవ’ అనే వాక్యం ఉంది. అదే రోజు జయలలిత ఆస్పత్రి గదిలో ప్రాణం కోల్పోవడం.. ఆ పక్కనే ఉన్న గదిలో పన్నీరు సెల్వం సహా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమిళనాడు కొత్త సీఎం కోసం చర్చలు జరపడం జరిగిపోయింది. ఇదంతా అక్షరాల నిజమైందని ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ క్యాలెండర్ వాక్యాలు వైరల్ అయ్యాయి.