గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 ఫిబ్రవరి 2024 (08:38 IST)

నేడు జార్ఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష... చంపయి సోరేన్ గండం గట్టెక్కేనా?

Champai Soren
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జేఎంఎం సీనియర్ నేత చంపయి సొరేన్ బాధ్యతలు స్వీకరించారు. ఈయన సారథ్యంలోని ప్రభుత్వం సోమవారం బలపరీక్షను ఎదుర్కోనుంది. హేమంత్ సొరేన్ తర్వాత సీఎంగా చంపయి సొరేన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎమ్మెల్యేల క్యాంపు రాజకీయాలకు తెరలేచాయి. దీంతో జేఎంఎంతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిను ఎమ్మెల్యేలను హైదరాబాద్ నగరానికి ప్రత్యేక విమానాల్లో తరలించి, ఓ హోటల్‌లో ఉంచారు. 
 
వీరిని బలపరీక్ష కోసం మళ్లీ ఆదివారం రాష్ట్ర రాజధాని రాంచీకి తరలించారు. అయితే, అధికార పార్టీకి ఉన్న మెజారిటీ దష్ట్యా విజయం లాంఛనమే అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసాధారణ ఘటనలు ఏమైనా జరిగితే తప్ప జేఎంఎం మళ్లీ జార్ఖండ్‌లో అధికారం చేజిక్కించుకుంటుందని పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉండగా ఒక స్థానం ఖాళీగా ఉండటంతో మేజిక్ ఫిగర్ 41గా ఉంది. జేఎంఎం సారథ్యంలోని అధికార కూటమికి మొత్తం 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేఎంఎం ఎమ్మెల్యేలు 28 మంది కాగా కాంగ్రెస్ పార్టీకి 16, ఆర్జేడీ, సీపీఐ(ఎమ్ఎల్)కు చేరో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఇక బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
 
అయితే, బలపరీక్ష ఎదుర్కోవడం జేఎంఎంకు ఇదే తొలిసారి కాదు. 2022 సెప్టెంబరు నెలలో జరిగిన బలపరీక్షలో 48 ఎమ్మెల్యేల మద్దతుతో జేఎంఎం అధికారం కైవసం చేసుకుంది. అప్పట్లోనూ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హేమంత్ సోరెన్ సభా బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంపయి సోరెన్‌కు పార్టీతో పాటు సోరెన్ కుటుంబం మద్దతు కూడా ఉంది. 90ల్లో ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం ఆయన శిబూ సోరెన్‌తో కలిసి ఉద్యమించారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు.