బీహార్ యువకుడి కడుపులో నెయిల్ కట్టర్, కత్తి, కీచెయిన్!!
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడి పొట్టలో నెయిల్ కట్టర్, కత్తి, కీచెయిన్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో పాటు అనారోగ్యంతో బాధపుడుతూ వచ్చిన ఆ యువకుడు ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పరీక్షించిన వైద్యులు లోహపు వస్తువులు ఉన్నట్టు గుర్తించారు. వాటిని సర్జరీ చేసి వెలికి తీశారు. బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లాలో వెలుగు చూసింది.
కొన్ని రోజుల క్రితం 22 యేళ్లున్న ఓ యువకుడు తీవ్రమైన కడుపునొప్పితో మోతిహరిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతనికి ఎక్స్‌రే తీయగా, కడుపులో కత్తెర, కీచెయిన్, నెయిల్ కట్టర్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో ఆదివారం సర్జరీ చేసి వాటిని తొలగించారు. ముందుగా ఒక కీచెయిన్ రింగ్‌ను తీశారు. ఆ తర్వాత రెండు తాళం చెవులు బయటపడ్డాయి.
ఆ తర్వాత నాలుగు అంగుళాల పొడవున్న కత్తి, రెండు నెయిల్ కట్టర్లు బయటకు తీసినట్టు ఆపరేషన్‌కు నేతృత్వం వహించిన డాక్టర్ అమిత్ కుమార్ వివరించారు. యువకుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటున్నాడని వెల్లడించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.