మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 24 ఆగస్టు 2019 (13:05 IST)

వాజ్‌పేయి సర్కారు కొలువుదీరినప్పుడు.. అరుణ్ జైట్లీ ఆ శాఖను..?

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూశారు. అరుణ్ జైట్లీ మృతిపట్ల బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంకా అరుణ్ జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కాగా... ఇటీవల తీవ్ర అనారోగ్యం  కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.
 
ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితమే బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. వరసగా ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడంతో బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో అరుణ్ జైట్లీ సేవలను బీజేపీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా అరుణ్ జైట్లీ చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తొలిసారి మంత్రిగా ఆయన పెట్టుబడుల ఉపసంహరణ శాఖను చేపట్టారు. ఆ శాఖను ప్రారంభించడం అదే తొలిసారి. 
 
న్యాయకోవిదుడైన రాంజెఠ్మలనీ ఆ శాఖకు రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు కూడా జైట్లీనే స్వీకరించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీనే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతల కోసం కేబినెట్‌ నుంచి వైదొలగినా.. 2003లో మళ్లీ కామర్స్‌ అండ్‌ లా మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో అద్వానీ ఆయన్ను రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమించారు. 
 
అంతేగాకుండా అరుణ్ జైట్లీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కుడిచేయి వంటివారు. మోదీకి బలమైన మద్దతుదారుగా నిలిచారు. ప్రధాని అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్‌ నాయకులు పెదవి విరిచినా మోదీకి మద్దతు ఇచ్చారు. అంతేకాదు మధ్యప్రదేశ్‌ ముఖ్యమమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎంపిక కూడా జైట్లీనే మద్దతుతోనే జరిగింది.
 
అప్పట్లో ఉమాభారతి వ్యతిరేకించినా.. ఆయన చౌహాన్‌కే ఓటు వేశారు. ఆ తర్వాత చౌహాన్‌ మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు భాజపాను నిలబెట్టారు. ఇక నోట్ల రద్దు, జీఎస్‌టీ, దివాలా చట్టానికి కోరలు తొడగడంలో జైట్లీ కీలక పాత్రను పోషించారు.