గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 18 ఆగస్టు 2019 (09:11 IST)

మరింత క్షీణించిన అరుణ్ జైట్లీ ఆరోగ్యం .. కృత్రిమశ్వాసతో ప్రాణం

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందున్న అరుణ్ జైట్లీ ఆరోగ్యం గత రెండు రోజులుగా మరింతగా క్షీణించింది. ముఖ్యంగా, ఆయన స్వతహాగా శ్వాసపీల్చలేక పోతున్నారు. దీంతో ఆయనకు ఈసీఎంఓ (ఎక్స్‌ట్రా కార్పొరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చి, ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 
 
నిజానికి ఆయనకు కిడ్నీల పనితీరు పూర్తిగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. అలాగే, శ్వాస పీల్చడంలో ఇబ్బందిపడుతున్నారు. దీంతో ఆయన్ను గత వారం న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు. ఆయన రెండు కిడ్నీలూ పనిచేయడం లేదని, గుండె పనితీరు మందగించిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు ఈసీఎంఓ (ఎక్స్ ట్రా కార్పొరియల్ మెంబ్రాన్ ఆక్సిజనేషన్)ను అమర్చి, ఐసీయూలో చికిత్సను అందిస్తున్నట్టు వైద్య వర్గాలు తెలిపాయి. 
 
తనంతట తానుగా ఆయన శ్వాస తీసుకునే పరిస్థితి లేకపోవడంతోనే, ఈ వ్యవస్థను ఏర్పాటు చేశామని, సాధారణంగా కిడ్నీలు పనిచేయకుండా, గుండె పనితీరు మందగించిన వేళ, శ్వాస సమస్యలు వచ్చినప్పుడు ఈ వ్యవస్థను అమరుస్తామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అరుణ్ జైట్లీ లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌పై ఉన్నారని అన్నారు. 
 
కాగా, పలువురు బీజేపీ నేతలతో పాటు, జైట్లీతో పరిచయమున్న ఎంతో మంది ఎయిమ్స్‌కు చేరుకుని, జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి జైట్లీని కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదని వైద్య వర్గాలు వెల్లడించాయి.