శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : మంగళవారం, 6 ఆగస్టు 2019 (16:06 IST)

పార్లమెంట్ తలుపులు మూసీ ఏపీని ముక్కలు చేయలేదా : గులాంకు షా కౌంటర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందో తెలియదా? పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లులు పాస్ చేయలేదా అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌ను కేంద్రం హోం మంత్రి అమిత్ షా సూటిగా ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో అమలవుతూ వచ్చిన ఆర్టికల్ 370ను రద్దు చేశారు. అలాగే, జమ్మూకాశ్మీర్‌ను రెండు ముక్కలుగా చేసే బిల్లును సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభలో జమ్మూకాశ్మీరు పునర్వ్యవస్థీకరణ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది. 
 
ఈ సందర్భంగా హోం మంత్రి అమిత్‌ షా, ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ మధ్య సంవాదం రసవత్తరంగా సాగింది. ఈ బిల్లుపై అమిత్ షా స్పందిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు ఎలా జరిగిందో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 'జమ్మూకాశ్మీరు బిల్లును హడావుడిగా తెచ్చామని అంటున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన బిల్లు ఆమోదాన్ని ఆజాద్‌ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఈ రోజు నేను బిల్లు తీసుకొస్తే ప్రవేశపెట్టడానికి అనుమతి లభించింది. చర్చ జరిగింది. బిల్లు కూడా ఆమోదం పొందుతుందన్నారు. 
 
కానీ, ఏపీ విభజన బిల్లు సమయంలో ఎంపీలను బయటకు పంపించారు. తలుపులు మూసి ప్రత్యక్ష ప్రసారాలు నిలిపివేసి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని విడగొట్టారు అని గుర్తు చేశారు. అపుడు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన తీరు ఏ విధంగా ఈ సభలోని అనేక మందికి తెలుసునంటూ ఆజాద్‌‌కు అమిత్ షా కౌంటరిచ్చారు. ఏపీ విభజనకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ తరపున తాను మధ్యవర్తిగా ఉండి ఏపీ, తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపానని తెలిపారు. ఏడాదిపాటు సమావేశాలు నిర్వహించామన్నారు. రెండు ప్రాంతాలవాళ్లూ ఈ అంశాన్ని కేంద్రానికి విడిచిపెడుతున్నామని చెప్పాకే రాష్ట్ర విభజన చేపట్టామని స్పష్టంచేశారు.
 
అంతకుముందు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. దీనికి బీజేపీ ఎంపీ సుజనాచౌదరి ఆయనకు గట్టిగా అడ్డుతగిలారు. 'మీరు మాత్రం ఆంధ్రప్రదేశ్‌ విభజనలో ఏకపక్షంగా వ్యవహరించలేదా? ఎవరికి సంఖ్యాబలం ఉంటే వారు దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకుంటారు' అని దెప్పిపొడిచారు.