బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 5 ఆగస్టు 2019 (13:39 IST)

కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?

దేశం మొత్తంలో జాతీయ జెండాతో పాటు రాష్ట్ర జెండాను అధికారికంగా ఎగరవేసే హక్కు ఉన్న ఏకైక రాష్ట్రం జమ్మూకశ్మీర్. భారత రాజ్యంగంలోని ఆర్టికల్ 370 ద్వారా ఆ రాష్ట్రానికి ఈ అధికారం వచ్చింది. ప్రభుత్వ భవనాలు, అధికార కార్యక్రమాల్లో జాతీయ జెండాతో సమానంగా జమ్మూకశ్మీర్‌లో రాష్ట్ర జెండాను ఎగరవేస్తారు.

 
ఎరుపురంగులో ఉన్నఈ జెండాలో ఎరుపును శ్రమశక్తికి సూచికగా, నాగలిని వ్యవసాయానికి ప్రతీకగా, నిలువుగా ఉన్న మూడు గీతలను మూడు ప్రాంతాల్లోని మూడు మతాల (జమ్మూ(హిందూ), కశ్మీర్(ముస్లిం), లద్దాక్(బౌద్ధులు))లకు ప్రాతినిధ్యం వహించేదిగా సూచిస్తారు.

 
1931లో జరిగిన రాజకీయ ఉద్యమంతో కశ్మీర్ జెండా పురుడుపోసుకుంది. అప్పుడు డోగ్రా రాజులు కశ్మీర్‌ను పాలించేవారు. 13 జూలై 1931న శ్రీనగర్‌లోని సెంట్రల్ జైలు వద్ద ఉద్యమిస్తున్న వారిపై వారి సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 21 మంది చనిపోయారు. ఈ ఉద్యమ సమయంలో గాయాలపాలైన ఒక వ్యక్తి తన రక్తంతో తడసిన చొక్కాను జమ్మూకశ్మీర్ జెండాగా ఎగరేశారని చెబుతారు.

 
జులై 13న ఇప్పటికీ అక్కడ 'మృతవీరుల దినం'గా జరుపుకుంటూ అధికారిక సెలవు ప్రకటిస్తారు. డోగ్రా రాజులకు వ్యతిరేకంగా ఉద్యమించిన నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 11 జూలై 1939న ఈ జెండాకు ఒక రూపునిచ్చి దాన్నే తమ పార్టీ జెండాగా మార్చుకుంది. 1952 జూన్ 7న జమ్మూకశ్మీర్ శాసన సభ ఇదే జండాను తమ రాష్ట్ర జెండాగా నిర్ణయిస్తూ బిల్లు ఆమోదించింది. అంతేకాకుండా 1947 నుంచి 1952 వరకు ఇదే తమ జాతీయ జెండా అని ప్రకటించింది.

 
నెహ్రూ, అబ్దుల్లాల మధ్య ఒప్పందం
1952లో కేంద్రం, రాష్ట్ర అధికారాలను నిర్వచించే ఒప్పందంపై నాటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, జమ్మూ కశ్మీర్ ప్రధాని షేక్ మొహమ్మద్ అబ్దుల్లాలు సంతకాలు చేశారు. జమ్మూకశ్మీర్ జెండా విషయంలో కూడా ఒక ఒప్పందం జరిగింది. త్రివర్ణ పతాకం జాతీయ జెండాగా ఉంటే, ఇది రాష్ట్ర జెండాగా ఉంటుందని అంగీకారం కుదిరింది. రెండు జెండాలను ఎగరేసే అధికారం కూడా రాష్ట్రానికి దఖలు పడింది.

 
ఈ ఒప్పందంలోని సెక్షన్ 4లో ''త్రివర్ణ పతాకంతో పాటు జమ్మూకశ్మీర్ జెండా ఎగరవేసేందుకు కేంద్రప్రభుత్వం అంగీకరిస్తుంది. జాతీయ పతాకం వల్ల రాష్ట్ర జెండా ఎగరవేయడానికి అవరోధం ఉండదని జమ్మూకశ్మీర్ స్పష్టం చేస్తుంది. భారత్‌లోని ఇతర ప్రదేశాల్లో జాతీయ జెండాకు ఎలాంటి స్థాయి ఉంటుందో జమ్మూకశ్మీర్‌లోనూ అలానే ఉంటుంది. అయితే, జమ్మూకశ్మీర్ స్వతంత్ర పోరాటానికి సంబంధించిన చారిత్రిక కారణాల దృష్ట్యా రాష్ట్ర జెండాకు కూడా గుర్తింపు ఉంటుంది'' అని పేర్కొన్నారు.

 
జెండా రూపశిల్పి ఎవరు?
జమ్మూకశ్మీర్ జెండా రూపశిల్పి ఎవరనేదానిపై స్పష్టత లేదు. అయితే, మోహన్ రైనా అనే వ్యక్తి పేరు మాత్రం వినిపిస్తుంటుంది. ఈయన కళాకారుల కుటుంబానికి చెందిన వ్యక్తి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఈ జెండాను ఎన్నుకోవడానికి ప్రధాన కారణం ఆ పార్టీ కమ్యూనిజం భావజాలంతో స్ఫూర్తిపొందడమే అని కశ్మీర్ రాజకీయ విశ్లేషకులు గుల్ వాని బీబీసీకి చెప్పారు. ''ఈ జెండా రాజకీయ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తుంది'' అని ఆయన తెలిపారు.

 
కన్నడ జెండా వివాదం
కర్ణాటక ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక జెండా రూపొందించాలని 9 మందితో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. అయితే, విపక్షాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కర్ణాటక అవతరణ దినోవత్సవం అయిన నవంబర్ 1న ఎరుపు, పసుపు రంగులతో కూడిన జెండాను ఇప్పటికీ అక్కడక్కడ ఎగరవేస్తుంటారు.