శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (18:42 IST)

అమిత్‌షాతో అజిత్ ధోవల్ భేటీ... ఏదో జరుగుతోంది?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో సమావేశమయ్యారు. కాశ్మీర్‌లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత నెలకొంది. 
 
జమ్మూ కాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్రను నిలిపివేశారు. యాత్రికులను కూడ తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించారు. ఉగ్రవాదులు అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశం ఉందని ఐబీ హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకొంది. ఆదివారం మధ్యాహ్నం 12 :30 గంటలకు అమిత్ షా‌తో అజిత్ ధోవల్, ఇంటలిజెన్స్ చీఫ్ అరవింద్ కుమార్, రా చీఫ్ సుమంత్ గోయల్ సమావేశమయ్యారు. 
 
కాశ్మీర్ అంశంపైనే ఈ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యేడాది ఫిబ్రవరిలో పుల్వామాలో జరిపినట్టుగానే పలు దాడులకు ఉగ్రవాదులు ప్లాన్ చేశారని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో భారీ బలగాలను జమ్మూ కాశ్మీర్‌లో మోహరించినట్టుగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా ప్రకటించారు.
 
గత నెల 29 నుండి 31వ తేదీ మధ్య ఎల్ఐసీ వద్ద పాక్ కాల్పులకు తెగబడిందని భారత్ ప్రకటించింది. ఎల్ఐసీని దాటేందుకు ప్రయత్నించిన పాక్‌కు చెందిన ఐదుగురు మృతి చెందినట్టుగా భారత్ సైన్యం తెలిపింది.
 
 కాశ్మీర్‌లో సుమారు 35 వేల పారా మిలటరీ బలగాలను మోహరించారు. కాశ్మీర్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని చెబుతున్నారు. సోమవారం ఉదయం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అంశమే ఎజెండా కానుందని సమాచారం.