శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 ఏప్రియల్ 2020 (19:25 IST)

దేశంలో పెళ్లిళ్లు వాయిదా.. కానీ, 17న కుమారస్వామి ఇంట వివాహం...

కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామి కుమారుడు వివాహానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్నప్పటికీ ఆయన తన కుమారుడికి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఏప్రిల్ 17వ తేదీన ముహూర్తంగా నిర్ణయించుకున్నారు. 
 
దీనిపై ఎన్నో రకాలైన విమర్శలు వస్తున్నప్పటికీ... ఆయన మాత్రం ముందుకు సాగాలని భావిస్తున్నారు. దీంతో కుమార స్వామి కుమారుడు నిఖిల్ గౌడ వివాహం ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 17వ తేదీ గురువారం జరుగనుంది.
 
కరోనా వైరస్ కారణంగా బెంగుళూరు నగరాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. దీంతో ఆయన తన కుమారుడి వివాహాన్ని రామనగరలో ఉన్న ఫామ్‌హౌస్‌లో జరిపించేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతం గ్రీన్ జోన్‌లో ఉండటంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
 
దీనికి కారణం.. రామనగర్‌లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదనీ, పైగా.. 60 మంది కుటుంబ సభ్యులు మాత్రమే పెళ్లికి హాజరవుతారని కుమారస్వామి వెల్లడించారు. 
 
తమ కుటుంబంలోనే ఏకంగా 10 నుంచి 12 మంది వరకు ఉన్నారని వారిని సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. పైగా, ఈ వివాహ వేడుకకు జేడీఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరూ కూడా రావొద్దని.. అందరూ ఇళ్లలోనే ఉండి ఈ జంటను ఆశీర్వాదించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. 
 
కాగా, నిఖిల్ గౌడకు రేవతి (22) అనే యువతితో గత 10వ తేదీన బెంగుళూరులో వివాహ నిశ్చితార్థం జరిగింది. నిజానికి ఈ వివాహం కూడా బెంగళూరునే చేయాలని తొలుత నిశ్చయించినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రామనగరలో చేయాలని నిర్ణయించారు. 
 
అయితే, వచ్చే నెల మూడో తేదీ వరకు ఎలాంటి వివాహాది శుభకార్యాలతోపాటు.. రాజకీయ, క్రీడా, మతపరమైన కార్యక్రమాలు నిర్వహించరాదని కేంద్ర హోంశాఖ స్పష్టంగా ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ వేడుకను నిర్వహిస్తే ఈ నిబంధనలను ఉల్లంఘించినట్టే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.