శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 జనవరి 2024 (09:57 IST)

జీవితంపై ఆశలన్నీ కోల్పోయా... జైలులో చనిపోవడమే మేలు : నరేశ్ గోయల్

jet airways
మనీలాండరింగ్ కేసులో అరెస్టయి ముంబైలోని ఆర్థర్ సెంట్రల్ జైలులో జీవితాన్ని గడుపుతున్న జెట్ ఎయిర్‌వేస్ అధిపతి నరేశ్ గోయల్ జీవితంపై విరక్తి చెందారు. తాను ఇపుడున్న పరిస్థితుల్లో చనిపోవడమే మంచిదంటున్నారు. "జీవితంపై ఆశలన్నీ కోల్పోయా. ప్రస్తుత పరిస్థితుల్లో బతకడం కంటే జైల్లోనే చనిపోవడం మేలు..!" అంటూ ఆయన కోర్టులో బోరున విలపించారు. 
 
కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచి ముంబైలోని ఆర్థర్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా శనివారం ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొద్దిసేపు వ్యక్తిగత విచారణకు అభ్యర్థించగా న్యాయమూర్తి ఎంజీ దేశ్పాండే అనుమతించారు.
 
''నా భార్యకు కేన్సర్ ముదిరిపోయింది. ఆమెను చాలా మిస్ అవుతున్నా. ఒక్కగానొక్క కుమార్తె కూడా అనారోగ్యంతో బాధపడుతుంది. వారిని చూసుకునేందుకు ఎవరూ లేరు. నేనూ బలహీనంగా ఉన్నా. ఆరోగ్యం క్షీణిస్తోంది. జేజే హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నా.. సమయానికి సేవలు అందడం లేదు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఆ ఆస్పత్రికి పంపొద్దు. ఇటువంటి పరిస్థితుల్లో జీవించడం కంటే.. జైల్లోనే చనిపోయేందుకు అనుమతించండి'' అని న్యాయమూర్తి ఎదుట చేతులు జోడించి, విలపించినట్లు న్యాయస్థానం రోజువారీ విచారణల రికార్డుల్లో నమోదైంది.
 
నరేశ్ గోయల్ తన పరిస్థితులను వివరిస్తున్నప్పుడు వణుకుతున్నట్లు గుర్తించానని న్యాయమూర్తి ఎంజీ దేశపాండే కోర్టు రికార్డుల్లో ప్రస్తావించారు. నిస్సహాయ స్థితిలో వదిలేయబోమని, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరైన చికిత్స అందించే విషయంలో ఆయనకు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గోయల్ తరపు న్యాయవాదులను ఆదేశించారు. మరోవైపు.. ఆయన బెయిల్ పిటిషన్‌పై ఈడీ ప్రతిస్పందనను దాఖలు చేసింది. జనవరి 16న ఈ అంశం తదుపరి విచారణకు రానుంది.
 
దేశీయ విమానయాన సంస్థ 'జెట్ ఎయిర్‌వేస్'కు కెనరా బ్యాంకు మొత్తం 848.86 కోట్లు రుణం ఇచ్చింది. అయితే అందులో 538.62 కోట్లు కంపెనీ తిరిగి చెల్లించలేదు. దీంతో కెనరా బ్యాంకు కేసు పెట్టింది. సీబీఐ ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. జెట్ ఎయిర్ వేస్ మోసం చేసినట్లు తేల్చింది. ఈ కేసులో మనీలాండరింగ్ అంశాలు తేలడంతో ఈడీ సైతం దర్యాప్తు చేపట్టింది. గతేడాది సెప్టెంబరు ఒకటో తేదీన నరేశ్ గోయల్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.