బుధవారం, 15 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2019 (16:13 IST)

'మహా' పరీక్షకు ముందే చేతులెత్తేసిన ఫడ్నవిస్... సంఖ్యాబలం లేదట..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన పదవికి రాజీనామా చేశారు. బుధవారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాల్సివుంది. కానీ, ఆయన ఈ పరీక్షకు ముందే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 23వ తేదీన సీఎంగా ప్రమాణం చేశారు. సోమవారం సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
కాగా, ఫలితంగా మహారాష్ట్రను మరో ఐదేళ్ళపాటు పరిపాలించాలన్న బీజేపీ ఆకాంక్షలకు తెరపడింది. కాసేపట్లో గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పిస్తామని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ ఈ ప్రకటనను వెలువరించారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి, వారిని లాక్కునే ప్రయత్నాలు తాము చేయబోమని, పార్టీలను చీల్చే ఉద్దేశ్యం తమకు అంతకంటే లేదన్నారు. 
 
శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు కలసి మంచి పాలన అందిస్తాయని ఆశిస్తున్నానని ఫడ్నవీస్ తెలిపారు. అయితే, ఆ మూడు పార్టీల విధానాలు, సిద్ధాంతాలు వేర్వేరని... ఈ నేపథ్యంలో, పాలన ఎలా సాగుతుందో వేచి చూడాలని అన్నారు. ఈ మూడు పార్టీలది కామన్ మినిమన్ ప్రోగ్రామ్ కాదని... కామన్ మ్యాగ్జిమమ్ ప్రోగ్రామ్ అని... బీజేపీని అధికారానికి దూరంగా ఉంచాలనేదే వారి ఆలోచన అని విమర్శించారు.
 
'అసెంబ్లీ ఎన్నికల్లో మా కూటమికి (బీజేపీ, శివసేన) ఓటర్లు సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు. శివసేనతో కలిసి పోటీ చేసినా తీర్పు బీజేపీకి అనుకూలంగా వచ్చిందని భావిస్తున్నా. ప్రజాభీష్టం ప్రకారం శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాము. సంఖ్యాబలం విషయంలో శివసేన బేరసారాలు ప్రారంభించింది. ప్రీపోల్ పొత్తు కుదుర్చుకున్న శివసేన... ఆ తర్వాత మమ్మల్ని మోసం చేసింది' అని ఫడ్నవీస్ విమర్శించారు.