శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (15:15 IST)

మహారాష్ట్ర: ఏ పార్టీ ఏం ఆశిస్తోంది? గతంలో ఇలాంటి వివాదాల్లో కోర్టు ఏం చెప్పింది?

కొన్నిసార్లు కోర్టులో జరిగే వాదనలు... పార్టీల వాస్తవ పరిస్థితి గురించి అవి అఫిడవిట్లలో, డాక్యుమెంట్లలో పేర్కొన్న దానికంటే ఎక్కువ విషయాలను బయటపెడుతుంటాయి. తాజాగా సుప్రీంకోర్టులో ఒకవైపు బీజేపీ తరఫున (మహారాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో సహా), మరోవైపు శివసేన, కాంగ్రెస్ పార్టీల తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనల్లో అది కనిపించింది. పై వాక్యంలో నేను ప్రత్యేకంగా ఎన్సీపీని ప్రస్తావించలేదు. ఎందుకంటే, ఆ పార్టీ ఎటువైపు ఉందో సుప్రీంకోర్టుతో పాటు, మిగతా అందరిలాగే నాకు కూడా స్పష్టత లేదు.

 
మొదటి నుంచీ కోర్టు నుంచి పార్టీలు ఏం ఆశిస్తున్నాయో స్పష్టంగా తెలిసిన విషయమే. సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్, శివసేన కోరుకుంటున్నాయి. మరోవైపు, నవంబర్ 30 వరకు విధించిన గడువు అలాగే ఉండాలని బీజేపీ కోరుకుంటోంది. కర్ణాటక కేసులో ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ, ఇప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీలోనూ 24 గంటల్లో బలపరీక్ష నిర్వహించేలా సుప్రీంకోర్టు ఆదేశించాలని కాంగ్రెస్, శివసేన కోరుతున్నాయి. మరోవైపు, సుప్రీంకోర్టు అలా మధ్యంతర ఆదేశాలను ఇవ్వగలదా అని బీజేపీ ప్రశ్నిస్తోంది.

 
1998 నాటి ఉత్తర్‌ప్రదేశ్‌లో జగదాంబికా పాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, ఆ తర్వాత గోవా, ఝార్ఖండ్, ఇటీవల కర్ణాటక విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్, శివసేనలు ఉదాహరణగా చూపుతున్నాయి. అప్పుడు, అసెంబ్లీలో 'విశ్వాసం' ఉన్నవారు బలనిరూపణ చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

 
1994లో ఎస్‌ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఆధారంగా చేసుకుని, ఈ నాలుగు కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటకలో బొమ్మాయి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1989లో రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించడం తీవ్ర వివాదానికి దారితీసింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బొమ్మాయి మొదట హైకోర్టుకు వెళ్లారు. అక్కడ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ తిరస్కరణకు గురైంది. దాంతో, ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

 
ఆ కేసుపై 1994లో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఆ తీర్పు ద్వారా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో గవర్నర్లు స్వార్థపూరితంగా ఏదో ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించడానికి ముగింపు పలికేందుకు న్యాయస్థానం ప్రయత్నించింది.

 
ఒకవేళ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలన్న విషయంలో ప్రజా తీర్పులో ఏమైనా అనుమానాలు ఉంటే, అప్పుడు ముందుకు వెళ్లాలంటే అసెంబ్లీలో 'బలపరీక్ష' ఒక్కటే మార్గం అని సుప్రీంకోర్టు ఆ తీర్పులో పేర్కొంది. అయితే, అలాంటి ఆదేశాలు ఇవ్వకూడదని, అది రాజ్యాంగంలోని 212వ అధికరణానికి (శాసన సభ కార్యకలాపాలను కోర్టులు ప్రశ్నించలేవని ఈ అధికరణం చెబుతోంది), 361వ అధికరణానికి (గవర్నర్ లేదా రాష్ట్రపతి తాము తీసుకునే నిర్ణయాలకు కోర్టులో జవాబుదారిగా ఉండరని ఈ అధికరణం చెబుతుంది) వ్యతిరేకం అని ప్రస్తుతం బీజేపీ వాదిస్తోంది.

 
ఇందుకు సమాధానాలు సులువుగా చెప్పొచ్చు. రాజ్యాంగానికి విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా ఉన్న చర్యలను ఆర్టికల్ 212 రక్షించలేదు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ కేసు సందర్భంగా, ఉదాహరణకు రాష్ట్రపతి పాలన విధిస్తూ గవర్నర్ తీసుకునే నిర్ణయానికి ఈ ఆర్టికల్ రక్షణ కల్పించలేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అలాగే, ఆర్టికల్ 361 చెబుతున్నది ఏంటంటే, గవర్నర్ తాను తీసుకునే నిర్ణయాలకు కోర్టులో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, దానర్థం ఆ నిర్ణయం చట్టబద్ధమైనదా కాదా అని పరిశీలించే హక్కు కోర్టుకు లేదని కాదు.

 
బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనంలోని మెజార్టీ సభ్యులతో విభేదించిన జస్టిస్ రామస్వామి లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రస్తుతం బీజేపీ చేస్తున్న వాదనలు ఒకేలా ఉన్నాయి. గవర్నర్ చర్యల (ప్రభుత్వాన్ని రద్దు చేసినప్పుడు) కారణంగా రాజ్యాంగ సంక్షోభం తలెత్తిన సందర్భాలలో రాజ్యాంగ ధర్మాసనం పరిష్కారం చూపలేదని, ఆర్టికల్ 356ను సవరించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యతను పార్లమెంటుకు వదిలేయడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. గవర్నర్ చర్య తప్పా, ఒప్పా అన్నది విషయం కాదు. దానిపై కోర్టు ఏదైనా చేయాలా వద్దా అన్నది ఇక్కడ చర్చ.

 
మహారాష్ట్రలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు కర్ణాటక కంటే భిన్నంగా ఏమీ లేవు. ఈ రెండింటిలోనూ గవర్నర్ అత్యధిక సీట్లు సాధించిన పార్టీని బలనిరూపణకు ఆహ్వానించారు. అందులో తప్పేమీ లేదు. కానీ, బలనిరూపణకు ఎక్కువ రోజుల గడువు ఇవ్వడం, రాత్రికి రాత్రే ప్రమాణ స్వీకారాలు చేయించడం చూస్తే, గవర్నర్ నిర్ణయాలు నిస్వార్థంతో తీసుకున్నట్లుగా అనిపించడంలేదు. ఈ రెండు రాష్ట్రాల విషయంలోనూ, తనకు నచ్చిన పార్టీకి (తనను గవర్నర్ స్థానంలో నియమించిన పార్టీ) ప్రయోజనం చేకూర్చడమే ధ్యేయం అన్నట్లుగా గవర్నర్ చర్యలు ఉంటున్నాయని అనిపిస్తోంది. అలాంటి పరిస్థితుల్లో, కోర్టులు జోక్యం చేసుకోకూడదు అనడం సరికాదు.