గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 20 జులై 2021 (13:38 IST)

మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్... బీజేపీలోకి హస్తం ఎమ్మెల్యేలు

ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బతగలనుంది. ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మణిపూర్‌ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్ష పదవికి గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం బీజేపీలో చేరారు. 
 
అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో గోవిందాస్ కొంతౌజమ్ రాజీనామా చేయడం కాంగ్రెస్‌కు పూడ్చలేని నష్టంగా చెప్పొచ్చు. గోవిందాస్‌ కొంతౌజమ్‌ వరుసగా ఆరు సార్లు బిష్నాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
 
ఎంపీసీసీకి చీఫ్‌ విప్‌గా కూడా పని చేశారు. గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ ఆయనను మణిపూర్‌ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌గా నియమించారు. నెల క్రితం వరకు కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌పై తీవ్ర విమర్శలు చేసిన గోవిందాస్‌ ఇంత అనూహ్యంగా పార్టీ మారుతున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.