కష్టపడినా గుర్తింపు లేదని టీడీపీకి హైమావతి రాజీనామా
ఏపీలో తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి తన రాజీనామా ప్రకటించారు. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు.
శోభా హైమావతి కుమార్తె స్వాతి రాణి ఇప్పటికే వైసీపీలో చురుకుగా పనిచేస్తున్నారు. ఇక తల్లి హైమావతి పయనం కూడా అటే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. హైమావతి ఎస్.కోట నుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999లో ఆమె శృంగవరపుకోట నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ కు చెందిన గంధేశ్వరస్వామిని ఓడించారు.
తరువాత 2004లో జరిగిన ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ కు చెందిన కుంభా రవిబాబుపై ఓడిపోయారు. ఆ తరువాత 2009,2014, 2019 ఎన్నికల్లో ఆమెకు టిడిపి టిక్కెట్ ఇవ్వలేదు. పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆమెను చంద్రబాబు నియమించారు. తరువాత ఆమె పార్టీలో పెద్దగా కనిపించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.