శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (15:12 IST)

తూగో సరిహద్దుల్లో ఉద్రిక్తత.... తెదేపా కీలక నేతలు అరెస్టు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ - తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దుల్లో బాక్సైట్ మైనింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. అక్కడ జరుగుతోంది బాక్సైట్ మైనింగ్ కాదని, లైటరైట్ మాత్రమేనని ప్రభుత్వం చెప్తుండగా.. విపక్షాలు మాత్రం రూ.15 వేల కోట్ల బాక్సైట్ మైనింగే జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మైనింగ్ ప్రాంతాల పరిశీలనకు బయలుదేరిన టీడీపీ నేతల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. దీంతో తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో ఇవాళ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
 
పోలీసులు అరెస్టు చేసిన వారిలో టీడీపీ సీనియర్ నేతలైన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, చినరాజప్ప, నక్కా ఆనందబాబుతో పాటు.. మరికొందరు కీలక నేతలు ఉన్నారు. పోలీసుల తీరుపై అయ్యన్న, రాజప్ప, ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను టచ్ చేయొద్దంటూ అయ్యన్న పాత్రుడు పోలీసులపై సీరియస్ అయ్యారు. పోలీసుల నుంచి కరోనా సోకితే ఎవరు బాధ్యులని అయ్యన్న నిలదీశారు.
 
బాక్సైట్ మైనింగ్ పై వాస్తవాలు తెలుసుకనేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ ఆపాలని, బాక్సైట్ తవ్వకాలు నిలిపేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంపదను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.