శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (09:17 IST)

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న బీజేపీ ఎమ్మెల్యేలు... ఎక్కడ?

దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఈ నెల 23వ తేదీన వెల్లడికానున్నాయి. ఈ ఫలితాల కోసం దేశ ప్రజలేకాకుండా, ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే, ఈ ఫలితాల తర్వాత పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం కర్ణాటక రాష్ట్రంలో జోరుగా సాగుతోంది. 
 
ఈ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. ఈ సర్కారును కూలదోసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కమలనాథులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలతో వారి ఫలితాలు ఫలించలేదు. అయినప్పటికీ బీజేపీ నేతలు తమ వక్రబుద్ధిని వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడుతూనే ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి వేణుగోపాల్ స్పందిస్తూ, సరిగ్గా యేడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని, ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. 
 
బీజేపీ నుంచి తాము ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం లేదని అయితే ఈ నెల 23వ తేదీన ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరతారని ఆయన చెప్పారు. అదేసమయంలో కాంగ్రెస్ - జేడీఎస్‌ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.